- పోయిన బ్రాండ్ ఇమేజ్ పునరుద్ధరించాం
- 2026లోనూ పెట్టుబడుల ప్రవాహం ఏపీ వైపే ఉండాలి
- విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం.. ట్రూ డౌన్‌కు నాంది పలికాం
- సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
- 14వ ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు
- రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
- 14 సంస్థల ద్వారా 11,753 ఉద్యోగావకాశాలు
- ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పొర్టల్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్యరథం): టీమ్ వర్క్‌తో చేయడం వల్లే 2025వ సంవత్సరంలో పెట్టుబడుల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని… ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని మంత్రులకు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్‌ఐపీబీ సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రూ.8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్‌ఐపీబీ సమావేశం ప్రారంభం కాగానే మంత్రులు, సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చేయగలిగామని సీఎంతో చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారన్నారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
ప్రజలపై భారాన్ని తగ్గించగలిగాం, సంతోషంగా ఉంది
విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశాం. యూనిట్‌కు 13 పైసలు చొప్పున విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. రూ.4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ.3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయి. విద్యుత్ రంగంతోపాటు… వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయి. దావోస్ సదస్సుకు వెళ్లాం.. ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయగలిగాం… విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగాం. ఏపీకి గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకురావడానికి మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది… ఆ కిక్ కోసం అందరూ పని చేయాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలని సీఎం సూచించారు.
ఐ ల్యాండ్ టూరిజం అభివృద్ధిపై ఫోకస్
బాపట్ల జిల్లా సూర్యలంక అత్యంత సురక్షతమైన బీచ్ ప్రాంతం. బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ తయారు చేయండి. సూర్యలంక బీచ్ రిసార్ట్స్‌ను బ్రాండిరగ్ చేయండి. సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలి. 15 కిలోమీటర్ల మేర క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలి. కాలుష్య రహిత ప్రాంతంగా సూర్యలంక బీచ్ ఫ్రంట్ ఉండాలి. సూర్యలంకతో పాటు సూళ్లూరుపేట వద్ద ఉన్న చిన్ని చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చు. మాల్దీవుల తరహాలో ఐ ల్యాండ్ టూరిజం అభివృద్ధి చేసుకోవాలి. 25 వేల గదులు నిర్మించగలిగితే పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు. టూరిజం కార్పొరేషన్ మరింత బలోపేతం కావాలి. సూర్యలంక ఏపీటీడీసీ రేటింగ్ పెరగాల్సిన అవసరం ఉంది. రాబోయే 15 ఏళ్లలో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం టూరిజం కార్పోరేషన్‌కు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. పాపికొండలు-పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టండి. కోనసీమ, పులికాట్, విశాఖ క్లస్టర్లు అత్యద్భుత పర్యాటక క్లస్టర్లుగా తయారవుతాయి. అనంతపురం నుంచి గండికోట వరకూ టూరిజం క్లస్టర్లలో కూడా పర్యాటకానికి అవకాశం ఉంది. తిమ్మమ్మ మర్రిమాను అతిపెద్ద మర్రిచెట్టు. గూగుల్ మ్యాపింగ్ చేయండి. ఈ చెట్టుకు 2 వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఆవకాయ్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకు ఉత్సవ్, సీ టూ స్కై, ఏపీ ట్రావెల్ మార్ట్‌లను ఘనంగా నిర్వహించండి. విశాఖ, అమరావతికి హోటళ్లు, ఆస్పత్రులు విద్యా సంస్థలు వచ్చేలా చూడండి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు మాన్సాస్ ట్రస్ట్ తన భూములను విరాళంగా ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం చెప్పారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతులకు మేలు
మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తిరుపతి ప్రాంతానికి రావాల్సి ఉంది. అప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. వివిధ రకాల వెరైటీలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లకు వెళ్లాలి. వాల్యూ అడిషన్ జరిగితేనే రైతులకు గరిష్ట ప్రయోజనం దక్కుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయండి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ ఛాంపియన్ కావాలి. ప్రస్తుతం రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఉద్యాన ఉత్పత్తులు పెద్ద ఎత్తున పండే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కావాలి. పాలసీల అమలు విషయంలో ఎలాంటి డీవియేషన్ ఉండేందుకు వీల్లేదు. అందరికీ సమానంగా అవకాశాలు అందాలి. పాలసీ నిబంధనల్లో ఎలాంటి మినహాయింపులూ ఉండకూడదు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ సమీపంలో మరింత భూమిని పరిశ్రమల కోసం సిద్ధం చేయండి. ఎంప్లాయిమెంట్ పోర్టల్ కూడా త్వరలోనే అందుబాటులోకి రావాలి. స్పేస్ సిటీ కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరం అవుతాయి. మాకవరపాలెం వద్ద ఫుడ్ పార్క్ సహా అల్యూమినియం డౌన్‌స్ట్రీమ్ పరిశ్రమలు వచ్చేలా చూడండి. దీని కోసం ఇండస్ట్రియల్ పార్క్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎస్‌ఐపీబీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఐటీ ఇన్ఫ్రాపోర్టల్ ను ప్రారంభించారు. 14వ ఎస్‌ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, టీజీ భరత్, కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హజరయ్యారు.
పెట్టుబడుల వివరాలివే…
14వ ఎస్‌ఐపీబీ సమావేశంలో 14 సంస్థలకు చెందిన రూ. 19,391 కోట్ల పెట్టుబడులు, 11,753 ఉద్యోగ అవకాశాలకు ఆమోదం లభించింది. ఆమోదించిన పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలు:
ఆర్ణ కోస్టల్ రిసార్ట్స్-బాపట్ల జిల్లా-రూ. 187.58 కోట్లు-250 ఉద్యోగాలు
సైవెన్, యూనిఫై కన్సార్షియం-బాపట్ల జిల్లా-రూ. 183.87 కోట్లు-196 ఉద్యోగాలు
శుభం, ఇంద్రనీర్ కన్సార్షియం-బాపట్ల జిల్లా-రూ. 64.44 కోట్లు-100 ఉద్యోగాలు
ఇస్కాన్-సత్యసాయి జిల్లా-రూ. 425.20 కోట్లు-1035 ఉద్యోగాలు
సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్-అనంత జిల్లా -రూ. 200.82 కోట్లు-245 ఉద్యోగాలు
నవ ఫుడ్ సెంటర్-తిరుపతి జిల్లా- రూ. 44.42 కోట్లు-500 ఉద్యోగాలు
వెబ్ సోల్ రెన్యూవబుల్-నాయుడుపేట-రూ. 3538 కోట్లు-1980 ఉద్యోగాలు
టాటా పవర్-నెల్లూరు జిల్లా-రూ. 6675 కోట్లు-1000 ఉద్యోగాలు
రామ్ కో సిమెంట్స్-నంద్యాల జిల్లా-రూ. 1500 కోట్లు-300 ఉద్యోగాలు
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్-కడప జిల్లా-రూ. 5571 కోట్లు-5000 ఉద్యోగాలు
ఎథిరియల్ ఎక్స్ ప్లోరేషన్ గిల్డ్-తిరుపతి జిల్లా-రూ. 578 కోట్లు-382 ఉద్యోగాలు
పయనీర్ క్లీన్ యాంప్స్-చిత్తూరు జిల్లా-రూ. 159 కోట్లు-600 ఉద్యోగాలు
రాధికా వెజిటబుల్స్ ఆయిల్స్-విజయనగరం జిల్లా-రూ. 234 కోట్లు-165 ఉద్యోగాలు
రిలయెన్స్ కన్స్యూమర్స్-అనకాపల్లి జిల్లా-రూ. 30 కోట్లు.















