- మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతాపం
కుటుంబ సభ్యులకు పరామర్శ
కడప (చైతన్యరథం): రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు ఎజాజ్ మృతి బాధాకరం అని, ఈ దుర్ఘటన ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోందని రాష్ట్ర రవాణా, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం కడప నగరంలోని మృతుడి నివాసంలో ఎజాజ్ కుటుంబ సభ్యులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించి..కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆకతాయి చేష్టలు.. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవడం బాధాకరం అన్నారు. ఇటువంటి సంఘటనలు విద్యార్థి లోకానికే చెడ్డపేరు తీసుకువస్తాయన్నారు. ఈ సంఘటనంపై ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారన్నారు. ఎజాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుదని.. సమగ్రంగా విచారణ జరిపించి ఆయన మృతికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఉర్దూ పాఠశాలలో అందరితో ఆప్యాయంగా, మంచిగా మాట్లాడే ఒక మంచి ఉపాధ్యాయుడిని కోల్పోయామన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు అభిమానులు పాల్గొన్నారు.