5 కోట్లమంది ప్రజలు చైతన్యవంతులు కావాలి
వైసీపీ పోతేనే రాష్ట్రానికి భవిష్యత్
ప్రజలందరి కోసం రూ. 2 లక్షల కోట్లు నొక్కుడు, జగన్ ఒక్కడే రూ.2 లక్షల కోట్లు బొక్కుడు
అక్రమాలపై జగన్ సమాధానం చెప్పాలి
అర్ధరాత్రి సభలోనూ అశేషజనవాహిని
……..
రానున్న ఎన్నికల్లో పులివెందుల తో సహా రాష్ట్రంలోని 175 స్థానాల్లో టిడిపి విజయకేతనం ఎగురవేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. జగన్ పని అయిపోయింది. వైసీపీ కి ఎక్స్ పైరీ డేట్ దగ్గరపడింది అని ఆయనన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం లో బుధవారం అర్ధరాత్రి జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ రాష్ట్ర భవిష్యత్ బాగు పడాలంటే వైసీపీ పార్టీని బంగాళాఖాతం లో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు 5 కోట్లమంది ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. ప్రజాచైతన్యం తోనే తులసివనంలో గంజాయి మొక్కలను ఏరివేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలందరికీ బటన్ నొక్కుడు ద్వారా లక్షల కోట్లు పంచితే జగన్ ఒక్కడే 2 లక్షల కోట్లు బొక్కుతున్నారు అని చంద్రబాబు దుయ్యబట్టారు. నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్, ఇంటిపన్ను, చెత్త పన్నుల ద్వారా ప్రజల నుంచి అదనంగా సేకరించిన రూ.4.5 లక్షల కోట్లు, అప్పు చేసిన రూ. 10 లక్షల కోట్లు ఎటు పోతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి మనిషీ పైనా రూ.2 లక్షలు, ఒక్కో కుటుంబంలో 5గురు సభ్యులు వుంటే రూ. 10 లక్షలు అప్పు భారం మోపారని విమర్శించారు. ఆ అప్పు ఎవరు చెల్లించాలని ప్రశ్నించారు. మద్యనిషేధం చేస్తానని చెప్పి మద్యం ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టాడని విమర్శించారు.
జగన్ క్యాన్సర్ లాంటి వ్యక్తి అని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పోతేనే రాష్ట్రానికి భవిష్యత్ వుంటుందన్నారు. టిడిపి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరిగాయన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో వాటా, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు, విద్య, ఉద్యోగాలలో 33 శాతం రిజర్వేషన్ లను ఎన్టీఆర్ కల్పిస్తే తాను మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రపంచంలోనే మొదటి సారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పేదల కోసం తాను పెట్టిన చంద్రన్న భరోసా, విదేశీ విద్య పథకాలను వైసీపీ ప్రభుత్వం తీసివేసిందని ఆరోపించారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను సైతం మూసివేసిన దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. ఇసుక బంగారంలా మారిందని, వైసీపీ నాయకులకు ఇసుక దోపిడీ నిత్యకృత్యం గా మారిందన్నారు.
ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలో నున్న 50 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడి అన్నమో రామచంద్రా అంటూ అలమటించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు కొనసాగుతున్నాయని చెప్పారు. లాండ్ మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా ల నుంచి వచ్చే డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కే పోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం లేకపోయినా వైసీపీ నాయకులు కొందరు గంజాయి పంట పండిస్తున్నారు అని ఆరోపించారు. దేశం లో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో నే వుంటున్నాయన్నారు. రేషన్ బియ్యాన్ని సైతం రీ సైక్లింగ్ చేసి కాకినాడ పోర్ట్ ద్వారా ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రానికి రాజధాని సైతం లేకుండా చేసిన జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చంద్రబాబు విమర్శించారు. పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు నిర్మిస్తాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్ ను సంపద సృష్టి కేంద్రంగా తీర్చిదిద్దిన విధంగా అమరావతిని తయారు చేయాలని అనుకున్నట్టు చెప్పారు. ప్రపంచంలోనే నీతివంతమైన ప్రభుత్వం గా గుర్తింపు పొందిన సింగపూర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. పోలవరం సైతం టిడిపి హయాంలో 72 శాతం పూర్తయిందని చెప్పారు.
2019 లో టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చి వుంటే రాష్ట్రంలో కరువు శాశ్వతంగా కనుమరుగు అయ్యేదన్నారు. అంతేగాక 2029 నాటికి రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఆర్థికంగా మొదటి రెండు స్థానాల్లో వుండేవని చెప్పారు. తన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోనూ, ప్రజాజీవితంలో నూ వుండే అర్హత జగన్ కు లేదని ఆయన చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతిగా, నిజాయితీగా బతికానని, అందుకే ఎవరికీ భయపడనని చంద్రబాబు స్పష్టం చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.