- ఇది జాతీయ భావాలు కలిగిన పార్టీ
- పర్యాటకులపై దాడి పిరికిపంద చర్య
- ఉగ్రమూకలు ఫలితం అనుభవిస్తారు
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఉద్ఘాటన
- పహల్గామ్ నరమేధానికి నిరసనగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ
అమరావతి (చైతన్యరథం): జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధాన్ని ఖండిస్తూ టీడీపీ నేతల ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయం గేటు వద్ద గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. దాడిలో పాల్గొన్న ఉగ్ర మూకల్ని వెంటాడి మట్టుపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేతలు కోరారు. పర్యాటకులపై దాడి పిరికిపంద చర్య అన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ లాంటి దేశాల్ని ప్రపంచం వెలివేయాలని తెలిపారు. చేసిన పాపానికి ఫలితాన్ని అతి త్వరలోనే ఉగ్రమూకలు తప్పకుండా అనుభవిస్తారన్నారు. ఉగ్రవాదుల చేతిలో అమరులైన తెలుగువారైన చంద్రమౌళి, మధుసూదన్‌రావు కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం పది లక్షల రూపాయల సాయం ప్రకటించిందన్నారు.
భారతీయులందరూ ఒక్కతాటిపై నడవాలి: వర్ల రామయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కరులు కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై పైశాచికంగా దాడి చేసి ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ఈ ఉగ్రవాదాన్ని ఖండిరచాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ ఆదేశాలమేరకు టీడీపీ ప్రధాన కార్యాలయంలో చనిపోయిన యాత్రికులందరికి సంతాపం తెలియజేశాం. ఈ ఉగ్రవాదాన్ని టీడీపీ సహించదు. భారత దేశం కన్నెర్రజేస్తే పాకిస్థాన్ ఏమవుతుందో తెలుసుకోవాలి. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ తిన్న చావుదెబ్బ మరచిపోయినట్లున్నారు. దాడులకు పాల్పడ్డ ముష్కర ముఠా ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.
ఇలాంటి చర్యలను భారతీయులు సహించరు. టీడీపీ ఎప్పుడూ ససేమిరా సహించదు. ఎవరు, ఏ మతస్థులు అని అడిగి మరీ చంపడం చాలా దుర్మార్గం. ఈ దారుణ సంఘటనతో పాకిస్తాన్‌తో ఇండియాకు సంబంధాలు తెగి పోయాయి. వారెవరూ మన దేశానికి రావడానికి వీలులేదు. వారి ఆగడాలను చూస్తూ సహించం. ప్రతి పౌరుడు ఇటువంటి చర్యలను ఖండిరచాలి. అందరూ ఒక్క తాటిపై నడవాలి, ఇలాంటి సమయంలో అందరూ ఒక్క మాట మీద నిలబడాలి. పాకిస్థాన్ ఇక మనుగడ సాధించలేదు. టీడీపీ జాతీయ భావాలు కలిగిన పార్టీ. జాతితో పాటు నడుస్తుందని అధినేత చంద్రబాబు తరపున స్పష్టం చేస్తున్నా. జాతి గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక పౌరుడు సిద్ధంగా ఉండాలని వర్ల రామయ్య పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ఖబడ్దార్ పాకిస్తాన్, ఉగ్రదాడిని ఖండిరచాలి , మృతవీరులు జోహార్, ఉగ్రవాదం నశించాలి అని నినాదాలు చేశారు.