తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీని చావు దెబ్బకొట్టడం, తెలంగాణ లో తలపెట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం, సభ్యత్వ నమోదుకు భారీ స్పందన లభిస్తుందటం, అండమాన్ నికోబార్ దీవుల్లో నూ నగరపాలక సంస్థ అధికార పీఠంపై టిడిపి పతాక ఎగురటం వంటి పరిణామాలు పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచాయి. టిడిపి శ్రేణుల్లో ఇటీవలి కాలంలో ఎన్నడూ కానరాని ఉత్సాహం వెల్లువెత్తుతోంది.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు పార్టీ కోసం పడుతున్న శ్రమ ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విజయోత్సాహం తాత్కాలికం కాకుండా శాశ్వతం చేసే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికల వరకు పార్టీ శ్రేణుల్లో ఇదే విధమైన ఉత్సాహం, పోరాట పటిమ కొనసాగేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న చంద్రబాబు తెలంగాణ విషయంలోనూ అదే విధమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. తెలంగాణ లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పసుపు పతాక రెపరెపలు కానవస్తున్నాయి.
సభ్యత్వ నమోదు సైతం ఆశించిన దానికంటే అద్భుతంగా జరుగుతున్నట్టు తెలంగాణ టిడిపి నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 29 వ తేదీన జరుగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ గడ్డ పై టిడిపి నిర్వహించే అతిపెద్ద కార్యక్రమం ఇదే కావటం విశేషం. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాలలో వున్న పార్టీ ముఖ్యులు, ప్రతినిధులు దాదాపు 15 వేలమంది హాజరు కాగలరని అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్యక్రమం సజావుగా జరిగేందుకు అనువుగా 11 కమిటీలను నియమించి, నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఆవిర్భావ సభ ఏర్పాట్ల గూర్చి చంద్రబాబు స్వయంగా సమీక్షిస్తున్నారు. ఆవిర్భావ సభ అనంతరం మే నెలలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నభూతో నభవిష్యత్ అనే రీతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం గత ఏడాది మే 28 న శ్రీకారం చుట్టారు. ఏడాదిగా కొనసాగుతున్న ఉత్సవాలు ఈ సంవత్సరం మే 28 న ముగియనున్నాయి. ఈ కార్యక్రమాలతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఈ ఏడాది తెలంగాణ లో, వచ్చే ఏడాది ఎపిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎపిలో ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగినప్పటికీ సన్నద్ధంగా వుండేలా టిడిపి శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ టిడిపి దూకుడుగా వుండటం సామాన్య ప్రజానీకం లో సైతం చర్చనీయాంశం గా మారింది.