- 50 రోజుల్లో 73 లక్షల మంది నమోదు…కొత్తగా 54 శాతం మంది
- టాప్ 5లో రాజంపేట, నెల్లూరు సిటీ, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి
- క్యాడర్, నాయకులకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అభినందనలు
- పార్టీ, ప్రజల కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు కల్పిస్తాం
- సంక్షేమం అందించడంతో పాటు ఆర్థికంగా ఎదిగేలా కార్యక్రమాలు
- మంత్రులకు పెండిరగ్ బిల్లుల పరిష్కార బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం
మంగళగిరి(చైతన్యరథం): సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది..అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా శనివారం నాటికి 73 లక్షలకు చేరిందని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. సభ్యత్వ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదుతో బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తా మని చెప్పారు. సభ్యత్వ నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులతో చంద్రబాబు శనివారం సమీక్షించారు. ముందుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతుందన్న ఆ విభాగ ప్రతినిధులు సభ్యత్వ నమోదు అంశాలను వివరించారు. నేటికీ దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85 వేల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి పొందినట్లు చెప్పారు. ఇప్పటివరకు జరిగిన నమోదులో 54 శాతం మంది కొత్త వారు సభ్యత్వం తీసుకున్నట్లు వివరించారు. సభ్యత్వ నమోదులో 1.18 లక్షలతో రాజంపేట మొదటిస్థానంలో ఉండగా, నెల్లూరు సిటీలో 1.06 లక్షలు, కుప్పంలో 1.04 లకలు, పాలకొల్లులో 1.02 లక్షలు, మంగళగిరిలో 90 వేల సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి నలుగురిలో ఒకరు తెలుగుదేశం సభ్యత్వం పొందే పరిస్థితి రావాలని సూచించారు. తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమం అందించడంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ పథకాలు ప్రాధాన్యతా క్రమంలో అందించడం ద్వారా ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా కార్యకర్తల తలసరి ఆదాయం పెంపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. కష్టపడి పనిచేసిన వారికి మెరిట్ పద్దతిలో పదవులు ఇవ్వడంతో పాటు ఆయా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టే కార్యక్రమం పార్టీలో అన్నిస్థాయిల లో జరుగుతుందని చెప్పారు. అనంతరం పార్టీకి చెందిన ఇతర విభాగాల పనితీరుపైనా సమీక్షించారు.
ముగ్గురు మంత్రులకు పెండిరగ్ బిల్లుల పరిష్కార బాధ్యత
గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నీరు చెట్టు, నరేగా బిల్లులను నిలిపివేయగా తాము కొంత మేర బిల్లులు ఇచ్చామని..మిగిలిన మొత్తం కూడా త్వరలో చెల్లిస్తామని చంద్రబాబు చెప్పారు. నాడు పనులు చేసి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న వారి సమస్యల పరిష్కార బాధ్యతను ముగ్గురు మంత్రులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఈ అంశంపై ఎప్పటికప్పుడు చర్చించి ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం బిల్లులు మంజూరు అయ్యేలా చూసే బాధ్యతను అప్పగించారు.