న్యూఢల్లీి (చైతన్యరథం): రాష్ట్రాభివృద్ధికి మరింతగా సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ ఎంపీలు కోరారు. లోక్‌సభ, రాజ్యసభలు సోమవారం ఉదయం వాయిదా పడిన అనంతరం కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు.. పీఎం ఛాంబర్‌కు వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ హాజరైన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందని గుర్తుచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కొనసాగిస్తూ, మరింతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసినందుకు ఎంపీలు అభినందనలు తెలిపారు. ట్రంప్ సుంకాల వల్ల రాష్ట్రంపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో అగ్రరాజ్యంతో కేంద్రం చేస్తున్న పోరుకు అండగా ఉంటామన్నారు.
రాష్ట్రం నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యే ఆక్వా, మత్స్య ఉత్పత్తులు, మిర్చి, ఇతర ఆహార ఎగుమతులపై అమెరికా సంకాలు తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తాము ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిసారించామని చెప్పారు. పలు మంత్రిత్వశాఖల సంయుక్త కార్యదర్శులతో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ఫలితాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి ఎంపీలంతా ఒక్కో నియోజకవర్గంలో ఎలా విజయవంతం చేశారో తెలియజేసే పుస్తకాలను ప్రధానికి టీడీపీపీ నేత లావు కృష్ణదేవరాయులు అందించారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. విజయనగరం ఎంపీ అప్పలనాయుడిని ప్రధాని మోదీకి పరిచయం చేశారు. అప్పలనాయుడు కొత్తకొత్త విషయాలను అన్వేషిస్తారని, మంచి ఆసక్తి గల వ్యక్తి అని మోదీ కితాబిచ్చారు.