- సీఎం చంద్రబాబుతో చంద్రశేఖరన్ భేటీ
- కీలక సమావేశానికి హాజరైన మంత్రి లోకేష్
- రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకుంటామన్న టాటా
- రాష్ట్రంలో ‘టాటా’ హోటళ్లను విస్తరిస్తాం..
- విశాఖకు కొత్త ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్..
- కీలక రంగాల అభివృద్ధిపై ఇరువర్గాల చర్చ
- ‘ఎక్స్’ వేదికపై పోస్టు చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ఏపీ ప్రభుత్వం, టాటా గ్రూప్ కంపెనీలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. టాటా కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లూకేష్‌లతో సమావేశమయ్యారు. భారతదేశ పారిశ్రామిక చిత్రపటంపై చెరగని ముద్రవేసిన దార్శనికుడు రతన్ టాటా అద్భుత వారసత్వాన్ని కొనసాగించాలన్న అంశంపై ఇరువర్గాల మధ్య అభివృద్ధి దిశగా సానుకూల చర్చలు సాగాయి. ఏపీ అభివృద్ధికి రతన్ టాటా ఎనలేని కృషి చేశారని, ఆంధ్రా అభివృద్ధిలో కీలక వాటాదారుగా టాటా గ్రూప్ కొనసాగుతోందన్న విశ్వాసంతో ఉన్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ వృద్ధికి సంబంధించి కీలక రంగాల్లో తన పాత్ర కొనసాగించేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని, పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా అడుగులేద్దామని టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారని అంటున్నారు.
ఈమేరకు టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మధ్య జరిగిన భేటీలో రాష్ట్రాభివృద్ధికి ఇతోధిక సహకారం అందించే దిశగా కొంత కీలక చర్చ నడిచినట్టు తెలుస్తోంది. రూ.40వేల కోట్ల పెట్టుబడితో టాటాపవర్ సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుపైనా ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక రంగాలపై సాగిన చర్చలో.. రాష్ట్రవ్యాప్తంగా మరో 20 హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తాజ్, వివాంటా, గేట్వే, సెలెక్యూషన్స్, జింజర్ హోటళ్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. విశాఖలో కొత్త ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకూ నిర్ణయించారు. ఇప్పటికే విశాఖలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన టాటా గ్రూప్స్.. ఆ కేంద్రం ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించనుండటం తెలిసిందే. కీలక భేటీ అనంతరం `చంద్రశేఖరన్‌తో సాగిన భేటీ సారాంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ‘ఎక్స్’ వేదికపై పోస్టు చేస్తూ ప్రజలతో పంచుకున్నారు.