- సహకరిస్తున్న సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్
- టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు
- ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
అమరావతి(చైతన్యరథం): జగన్ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం పట్టుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే జగన్ ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు, ఎలక్షన్ కమిషన్ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేసినట్లుగా ఆపిల్ సంస్థ నుంచి భద్రతా హెచ్చరికల సందేశం వచ్చిందన్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని తాడేపల్లి కేంద్రంగా అత్యాధునిక టెక్నాలజీతో ఫోన్లు ట్యాప్ చేయిస్తూ జగన్ రెడ్డి జనం వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతున్నాడని దేవినేని మండిపడ్డారు. దీన్ని గతంలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయట పెట్టినట్లు తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లపై వెంటనే జగన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
అధికారుల అండతోనే ఫోన్ ట్యాపింగ్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో పలువురు అధికారులు జైళ్లకు వెళుతున్నా… జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ, డీఎస్పీలు నరేంద్రరెడ్డి, రవీంద్రా రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి లు ఫోన్ ట్యాపింగ్ కు సహకరిస్తున్నారని దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ఈ ఫోన్ల ట్యాపింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీఎంపీ కనకమేడల ఫిర్యాదు చేసినట్లు దేవినేని తెలియజేశారు. ఇంతకుముందు కూడా ఫోన్ల ట్యాపింగ్పౖౖె శాసనసభ, శాసనమండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నించినట్లు గుర్తు చేశారు.
వైసీపీ మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్లోనే..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సాఫ్ట్వేర్ తో తాడేపల్లి ప్యాలెస్ నుండి వైసీపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. వైసీపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ , రామచంద్రారెడ్డి, మరికొంత మంది ఎమ్మెల్యేలు తమ ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. వైసీపీ నేతల రహస్య వివరాలను కూడా ఫోన్ ట్యాపింగ్ లతో జగన్ రెడ్డి తెలుకుంటున్నారని దేవినేని విమర్శించారు.
టీడీపీ వర్క్‌షాప్ లో వివరాల చోరీకి యత్నం
ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ వర్క్‌షాప్ సమాచారాన్ని సేకరించి జగన్ రెడ్డికి పంపేందుకు కానిస్టేబుల్ విశ్వేశ్వరరావును జగన్ తొత్తులుగా పనిచేస్తున్న ఉన్నతాధికారులు పంపితే అతన్ని టీడీపీ నాయకులు పట్టుకున్నారన్నారు. ఇలా జగన్ రెడ్డి అధికారులను అడ్డుపెట్టుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఇలాంటి చర్యలు దేశ సమగ్రతకు, వ్యక్తుల గోప్యతకు భంగం కలిగిస్తుందని దేవినేని విమర్శించారు.
ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
ఫోన్ ట్యాపింగ్‌లపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయర్ రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ సీతారామాంజనేయులు వెంటనే సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. జగన్ రెడ్డి కోసం ఫోన్ ట్యాపింగ్ కు సహకరిస్తున్న అధికారులపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అధికారులతో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత గోప్యతకు భద్రత ఉండదన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలన్నారు. ఇటువంటి అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచి రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని దేవినేని కోరారు.