- బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పండి
- ఏపీ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దారితప్పి బంగ్లాదేశ్ పరిధిలోని సముద్ర జలాల్లోకి వెళ్లిపోయిన మత్స్యకారుల రక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలని యుఏఈ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దుబాయ్ పర్యటనలో భాగంగా తొలిరోజు కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. దారితప్పిన మత్స్యకారుల సమాచారం తెలియడంతో సీఎం చంద్రబాబు తక్షణం స్పందించారు. బంగ్లాదేశ్ నావికాదళం అదుపులోవున్న ఏపీకి చెందిన మత్య్సకారులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే చర్యల్లో అధికారుల నిమగ్నమయ్యారు. సముద్రంలో వేటకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన కొందరు మత్య్సకారులు, సముద్రంలో వాతావరణం అనుకూలించ పోవడంతో దారితప్పి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ నౌకాదళం అదుపులో ఏపీ మత్య్సకారులు ఉన్నట్టు సమాచారం. సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. దుబాయ్‌నుంచే మత్య్సకారుల గురించి ఆరా తీశారు. బంగ్లాదేశ్ చెరనుంచి వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా.. భయాందోళనకు గురవుతున్న మత్య్సకారుల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పాలని, ప్రభుత్వం వారికి తోడుగా ఉందన్న భరోసా కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.










