- క్వింటా మామిడికి రూ.1,490 ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- 50:50 నిష్పత్తిలో మద్దతు ధర చెల్లించనున్న కేంద్రరాష్ట్రాలు
- నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్న నగదు
- ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు కృషి
- సీఎం చంద్రబాబుకి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మామిడి రైతులు
అమరావతి (చైతన్యరథం): తోతాపురి మామిడి రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర (ఎంఐపీ) కింద క్వింటాకు రూ.1,490 చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది అత్యధిక దిగుబడి రావడంతో ధర తగ్గుముఖం పట్టడంతో ఇబ్బందులు పడుతున్న తోతాపురి మామిడి రైతులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలబడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ముందే గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులతో, పల్ప్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. దిగుబడి ఎక్కువ ఉండటంతో మామిడి పంటను పల్ప్ ఫ్యాక్టరీలు తక్కువ ధరకు అడుగుతున్నారని తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పల్ప్ ఫ్యాక్టరీలు కిలో మామిడిని 8 రూ కొనాలని, దానికి అదనంగా ప్రభుత్వం రూ.4 అందచేస్తుందని తెలిపారు. మొత్తంగా రైతులకు కిలోకు రూ. 12 రూ చొప్పున అందే విధంగా చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఢల్లీి పర్యటనకు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను కలసి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి రైతులకు అదనంగా అందిస్తున్న మొత్తాన్ని 50:50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి అచ్చెన్నాయుడు అభ్యర్థనని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 చొప్పున ఎంఐపీ ప్రకటించింది. రైతులకు అదనంగా చెల్లించే మొత్తాన్ని 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం భరించనున్నాయి, ఆ అదనపు ధర మొత్తం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ఈ విషయం పట్ల తోతాపూరి మామిడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలబడిన కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబునాయుడుకి, మంత్రి అచ్చెన్నాయుడుకి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
మంత్రి అచ్చెన్నాయుడు హర్షం
తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ధరను కేంద్రం ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మామిడి రైతుల నష్టం రాకూడదని ముందుగానే గ్రహించి కేజీ మామిడిని రూ.12కి కొనుగొలు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ మామిడికి అదనంగా రూ.4 అందచేశామన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ధరను మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం అందచేసిందని తెలిపారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌లకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.