అమరావతి (చైతన్యరథం): స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి నేతృత్వంలోని బృందం మంగళవారం దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా పేరుపొందిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో పర్యటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో స్వచ్ఛత విషయంలో దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్న లక్ష్యంతో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ అడుగులు ముందుకి వేస్తోందని ఈ సందర్భంగా పట్టాభి తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దేశంలోని వివిధ నగరాల్లో పరిస్థితులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం పరిశుభ్రత విషయంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న ఇండోర్ నగరాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశామని తెలిపారు. ఇండోర్‌లో చేపడుతున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియలను తమ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించామన్నారు. ఇండోర్ నగర మేయర్ పుష్యమిత్ర భార్గవ్, కమిషనర్ శివమ్ వర్మ స్వయంగా తమ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసి ఎంతో సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. ఇండోర్ నగరంలో కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఇంటి వద్ద నుండి వేరు చేయబడిన చెత్త సేకరించే కార్యక్రమం, తడి చెత్త నుండి ప్రతి రోజూ వారు ఉత్పత్తి చేస్తున్న దాదాపు 15 టన్నుల బయో గ్యాస్ ప్లాంట్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్‌ఎఫ్), ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇతర వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించామని పట్టాభి తెలిపారు.