- అరెస్ట్ చేయకుండా ఉపశమనమా?
- న్యాయవ్యవస్థను అపహాస్యం చేయటమే
- హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం
- పాల్వాయి గేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు పిటిషన్‌పై విచారణ
న్యూఢల్లీ: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి, ఆ పరిసరాల్లోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు పోలింగ్‌బూత్ టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. పిన్నెల్లి అరెస్టుకు హైకోర్టు కల్పించిన వెసులుబాటును ఎత్తివేయాలని శేషగిరిరావు తన పిటిషన్లలో పేర్కొన్నారు. పోలింగ్ రోజున మే 13 మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు పోలింగ్‌బూత్‌లో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసు, మరో మూడు కేసుల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసంతో పాటు తనపై హత్యాయత్నం చేశారని, పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. కౌంటింగ్ రోజు కూడా ఆయన హింసకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈవీఎం ధ్వంసం వీడియోను ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫు న్యాయవాదులు ప్రదర్శించారు. దీనిపై ఏం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించగా, పిన్నెల్లి తరఫు న్యాయవాదులు చెప్పేదేమీ లేదన్నారు. దీంతో న్యాయమూర్తులు స్పందిస్తూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదన్నారు. పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ముందస్తు ఉపశమనం కలిగించిన ఏపీ హైకోర్టు ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆదేశాలు ఇచ్చి హైకోర్టు తప్పు చేసిందని, ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడిరది. అలాగే పిన్నెల్లి కేసును ఈ నెల 6వ తేదీన విచారించి, తగు విధంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.
హత్యాయత్నం కేసులు
పాల్వాయి గేటు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ శేషగిరిరావుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి దాడి చేశారు. ఆ ఘటనలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ పోలీస్ అధికారిపై దాడి చేయడంతో మరో హత్యాయత్నం కేసు ఫైల్ చేశారు. పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ఇంతలో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించడంతో జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది