అమ్మనబ్రోలు (చైతన్యరథం): పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పలువురు రైతులు మంత్రి నారా లోకేష్‌కు విన్నవించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో గురువారం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్‌ను పొగాకు రైతులు కలుసుకొని తమ సమస్యను తెలియజేశారు. వెంటనే మంత్రి లోకేష్ వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఫోన్ చేసి పొగాకు రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై అవసరమైతే కేంద్ర పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడాల్సిందిగా సూచించారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ధర పెంపు విషయమై ఇప్పటికే పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు, బోర్డు అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. 20 కి.మీ. లోపు రవాణా చార్జీలను చెల్లించేందుకు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు.