టొరంటో (కెనడా`చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగతిశీల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఏఐ, క్లీన్ టెక్, రెన్యూవబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగంలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. టొరంటో కాన్సలేట్ జనరల్ ఆఫ్ ఇండియా కపిధ్వజ ప్రతాప్ సింగ్, కెనడా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ‘‘భారత్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అత్యంత అనుకూలమైన ప్రదేశం. అనుభవజుడైన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తోంది. ఏపీలో పెట్టుబడులకు ముందుకువచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో కేవలం 21రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నాం. రాష్ట్రంలో అనుసరిస్తున్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలవల్ల కేవలం 18 నెలల్లోనే రూ.23.5లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని గ్లోబల్ సంస్థలు రాబోతున్నాయి. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి మీంతు సహకారం అందించండి’’ అని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
టొరంటో కాన్సులేట్ జనరల్ కపిధ్వజ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ… గత ఏడాది భారత్ `కెనడా నడుమ వాణిజ్యం విలువ 30.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇరుదేశాల నడుమ ప్రాధాన్యతారంగాల్లో సహకారం మరింతగా పెరిగే అవకాశముంది. భారతదేశపు విధాన లక్ష్యాలకు అనుగుణంగా కెనడా వాణిజ్యాన్ని కేంద్రీకరించింది. ప్రధానంగా వ్యవసాయం, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులు, ఆహారం, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, క్లీన్ టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి (జీవశక్తి, గాలి, నీరు, సౌరశక్తి) రంగాల్లో కెనడా దృష్టిసారించింది. డిజిటల్ పరిశ్రమలు/ కృత్రిమ మేధస్సు / ఎల్‌వోటీ, మౌలిక వసతులు, రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, ఆనకట్టలు, ఇతర రంగాలపై కెనడా ఆసక్తిగా ఉంది’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని ప్రతాప్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.















