- పునరుద్ధరణ.. లేదంటే తత్సమాన లబ్ది
- గిరిజనులకు ఉద్యోగ కల్పనకు కట్టుబడే ఉన్నా
- సర్కారీ కొలువుల్లో న్యాయానికి పాతికేళ్ల కిందటే జీవో
- న్యాయ సమీక్షలో రద్దయిన జీవో 3 పునరుద్ధరణకు చర్యలు
- సుప్రీం ఆదేశాలు, మార్గదర్శకాలకు లోబడే న్యాయం చేస్తాం
- ట్రైబల్ వెల్ఫేర్ సమీక్షలో సీఎం చంద్రబాబునాయుడు వెల్లడి
అమరావతి (చైతన్య రథం): ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వోద్యోగాల్లో నూరుశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వోద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2000 ఏడాదిలో జీవో 3 తెచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే… 2020లో రద్దయిన జీవో 3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీపం ఆదేశించారు. సోమవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. సమీక్షలో గిరిజన సంక్షేమ శాఖ, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే సమస్య సంక్లిష్టం
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టుల్లో 100 శాతం రిజర్వేషన్లు తెచ్చాం. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని 2000లో జీవోఎంఎస్ నంబర్ 3 తెచ్చాం. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4,626 టీచర్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. అయితే జీవో నెంబర్ 3పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా… వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించింది. దీంతో రివ్యూ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా లభించే లబ్దిని కోల్పోయారు’’ అని సీఎం స్పష్టం చేశారు.
చట్టపరమైన అడ్డంకులపై అధ్యయనం
జీవో నెంబర్ 3 పునరుద్దణ లేదా అదే తరహా న్యాయం చేసేందుకు గిరిజనులకు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీమేరకు జీ.వో నెంబర్ 3 రద్దు అనంతర పరిణామాలపై అధికారులతో సీఎం చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3 ద్వారా నాడు గిరిజనులకు కలిగిన లబ్దిని పునరుద్దరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు నూరుశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాల గురించి, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకుల గురించి చర్చించారు. జీ.వో నెంబర్ 3 పునరుద్దరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనుల, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తిరిగి ఈ ఉత్తర్వుల ద్వారా లభించే లబ్దిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని… ఇందులో భాగంగా న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
ముఖ్యమంత్రి ముందు మూడు ఆప్షన్లు
జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న మూడు అవకాశాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొదటి ఆప్షన్‌గా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో 100 శాతం రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండవ ఆప్షన్‌గా స్థానిక గిరిజనులకు వారి యెక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, మూడవ ఆప్షన్‌గా సుప్రీంకోర్టు సూచించినట్టు 50 శాతం మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి వారి హక్కులను పరిక్షించడం వంటి అవకాశాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ ‘‘గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో గిరిజనుల హక్కులకు కట్టుబడి ఉన్నామని… ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీ.వో నెంబర్ 3 పునరుద్దరించడం లేదా… అదేస్థాయిలో గిరిజనులకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ విషయంలో జాతీయస్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరపాలి’’ అని సీఎం సూచించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు… విద్య-వైద్య సదుపాయాలు కల్పిస్తూ, ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.