- భవిష్యత్ రాజకీయాలకు భావినేతలు మీరే..
- సమాజంలో మార్పు తీసుకొచ్చే బాధ్యత మీదే
- హక్కులతోపాటు బాధ్యతలూ గుర్తించి ముందుకెళ్లండి
- వికసిత్ భారత్ `2047లో భావిపౌరులంతా భాగస్వాములే
- తల్లిదండ్రులు కూడా తమవంతు కర్తవ్యం నిర్వర్తించాలి
- భారత రాజ్యాంగ దినోత్సవాన మంత్రి లోకేష్ పిలుపు
అమరావతి (చైతన్య రథం): విద్యార్థులు భవిష్యత్ రాజకీయాల్లో కీలకపాత్ర వహించి, సమాజంలో మార్పు తీసుకురావాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులతూ నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ‘‘యువగళం పాదయాత్ర సమయంలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగాను. పాదయాత్ర సమయంలో నన్ను అడ్డుకున్న పోలీసులకు ఆర్టికల్ 19లో పొందుపర్చిన ‘రైట్ టు ఫ్రీడమ్’ గురించి చెప్పాను. వారు అదంతా మాకు తెలీదు, ఎస్పీతో మాట్లాడమని చెప్పేవారు. పిల్లలకు చిన్నవయసులోనే రాజ్యాంగ హక్కులు, బాధ్యతల గురించి తెలియజేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. నేను స్టాన్ ఫోర్డ్ ప్రవేశపరీక్ష సందర్భంగా రాసిన వ్యాసంలో ప్రజాసేవ, పాజిటివ్ లీడర్ షిప్‌తో సమాజంలో మార్పు వస్తుందని రాశాను. మీరు భవిష్యత్తులో ఏ వృత్తిలోకి వెళ్లినా నైతికతను వీడొద్దు. రాజకీయాల్లో పాజిటివ్ లీడర్ షిప్ తేవడానికి కృషిచేయండి. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్లినా భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలబడాలి’’ అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
లివింగ్ క్లాస్ రూప్ ఆఫ్ డెమొక్రసీ
‘‘రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 7 లక్షలమందితో పోటీపడి మీరంతా ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. మనసులో ఒకటి సాధించాలి అనుకున్నపుడు దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలని పోరాడాను. ఈరోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ. శాసనసభ కార్యకలాపాలన్నీ మీరు ఈరోజు చూశారు. అనేక ప్రశ్నలు, బిల్లులు తెచ్చారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం చేయాలన్నది మన ప్రభుత్వ లక్ష్యం. రైతుల సమస్యలు, పిల్లలు సెల్ ఫోన్ ఎడిక్షన్, యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌పై నమూనా అసెంబ్లీలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు క్రమశిక్షణ, హుందాతనం ముఖ్యం. శాసనసభలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాటిని అదుపు చేసుకున్నపుడే ప్రజాస్వామ్య భాగస్వామ్యం ఏర్పడుతుంది’’ అని లోకేష్ ఉద్ఘాటించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిస్వరం ముఖ్యమే
‘‘1949లో భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. ఎంతోమంది పెద్దల కృషితో, చర్చల ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. కేవలం మన ప్రాథమిక హక్కుల గురించి కాదు, బాధ్యతల గురించీ తెలుసుకోవాలి. విలువలు, సమిష్టి బాధ్యత గురించి ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతివ్యక్తి స్వరం చాలా ముఖ్యం. ఇది మనమంతా గుర్తుపెట్టుకోవాలి. నమూనా అసెంబ్లీలో మీ వాయిస్ విన్నాం. మంత్రులంతా చూశారు. శాసనసభ చైతన్యవంతంగా నడవాలని అనుకున్నాం. హక్కులతో పాటు బాధ్యతలనూ గుర్తెరిగి ముందుకెళ్లాలి. ఏడాది క్రితం ఇదే కాంపౌండ్‌లో సీఎం చంద్రబాబు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లలకోసం బాలల భారత రాజ్యాంగాన్ని తెస్తాం. యావత్ దేశ పిల్లలకు అందించే బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చాను. మీ అందరి సమక్షంలో ఆ పుస్తకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆవిష్కరించాం. దీనిని పిల్లలకు అర్థమైనరీతిలో రూపొందించాం’’ అని లోకేష్ వివరించారు.
పుస్తకంలో స్ఫూర్తిప్రదాతల గాధలు
‘‘రాజ్యాంగం భారతదేశానికి ఆత్మలాంటిది. గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అజాద్‌వంటి స్ఫూర్తిప్రదాతల గాథలతో రూపొందించాం. మంగళగిరికి చెందిన కనకపుట్లమ్మను నిన్న ఇంటికి పిలిపించి మాట్లాడాను. వారి కుటుంబం నేపథ్యం నాకు స్ఫూర్తినిచ్చింది. ఆమె తండ్రి పోలియోతో బాధపడుతుంటే… తల్లితో కలిసి కూరగాయల వ్యాపారం చూసుకొని, పొద్దున స్కూలుకెళ్లి చదివుకొని క్లాస్ టాపర్‌గా మనముందట నిలచింది. మీ అందరి సక్సెస్‌లో తల్లిదండ్రుల కృషి చాలాఉంది. ఇటీవల చాగంటి కోటేశ్వరరావుతో నైతిక విలువలపై సమావేశం ఏర్పాటుచేశాం. ఆయన ఒక మంచి మాట చెప్పారు. మనం తీసుకోబోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి, తల్లికి చెప్పలేని నిర్ణయం తీసుకోకూడదు’’ అని మంత్రి అన్నారు.
దేశభవిష్యత్ మీ చేతుల్లోనే…!
‘‘మీరంతా భవిష్యత్తులో ప్రయోజకులుగా మారతారు. భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నరేంద్ర మోదీజీ వికసిత్ భారత్`2047 లక్ష్యానికి అనుగుణంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలి. ఇది కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులతో సాధ్యం కాదు. మీరంతా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలి. ఈ లక్ష్య సాధనలో నైతిక విలువలు కూడా చాలా అవసరం. అందుకే ముఖ్యమంత్రి చాగంటికి కేబినెట్ ర్యాంకు ఇచ్చి సలహాదారులుగా నియమించారు. ఆయన ప్రభుత్వ వాహనం, ఇతర సౌకర్యాలు కూడా తీసుకోవడం లేదు. సొంత ఖర్చుతో నా బాధ్యత నిర్వహిస్తానని చెప్పారు. మీరంతా రాబోయే తరం ప్రతినిధులు. మీ కోసం మేం అహర్నిశలు కష్టపడుతున్నాం. ప్రజాప్రభుత్వం వచ్చాక 9,600 పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని తెచ్చాం. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంగా చేయాల్సిన బాధ్యత మేం చేస్తాం. సమాజాన్ని ముందుకు నడపడంలో తల్లిదండ్రుల బాధ్యత ఉంది. నేను ఇక్కడ ఉన్నానంటే నా తల్లి భువనేశ్వరి కారణం. చిన్నతప్పు చేసినా నన్ను మా తల్లి మందలిస్తుంది’’ అని మంత్రి లోకేష్ అన్నారు.
మహిళలను గౌరవిస్తేనే అభివృద్ధి
‘‘తెలుగువాడుక భాషలో మహిళలను కించపర్చే పదాలకు వాటికి అడ్డుకట్ట వేయాలి. గాజులు తొడుక్కున్నావా? చీర కట్టుకున్నావా? అమ్మాయిలా ఏడవొద్దు వంటి పదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. ఇంట్లో అలాంటివి వాడొద్దని నా మాటగా చెప్పండి. వికసిత్ భారత్ సాధించాలంటే సమాజంలో స్త్రీ, పురుషులు సమానమని నిరూపించాలి, ఆచరణలో తీసుకురావాలి. ఇది కేవలం టెక్ట్స్ బుక్‌లో కాదు, ఆచరణలో అమలుచేయాలి. మగవాళ్లతో సమానంగా ఆడవారిని గౌరవించినపుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళలను గౌరవించడం మనమంతా బాధ్యతగా తీసుకోవాలి. ఈనాటి కార్యక్రమాన్ని 45వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లైవ్‌లో చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోటీపడి రాలేకపోయిన వారికి ప్రభుత్వం మెరుగైన అవకాశాలు కల్పిస్తుంది, అధైర్యపడాల్సిన పనిలేదు. విద్యార్థులు స్పష్టతతో భయం లేకుండా మాట్లాడాలి. చర్చ వాస్తవాల ఆధారంగా ఉండాలి. ఎదుటివారి అభిప్రాయం నచ్చకపోతే కించపర్చకుండా విభేదించాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.











