- సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం పిలుపు
- సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- కేసు నిగ్గు తేల్చాలంటూ సీబీఐకి లేఖ రాయాలని ఆదేశం
- తగినంత యూరియా ఉన్నా.. విమర్శలు తప్పట్లేదు
- కుప్పం కాల్వకు కృష్ణమ్మ జలాలపైనా ఇదే పరిస్థితి
- అసత్య ప్రచారాలు జనంలోకి వెళ్లకుండా తగు చర్యలు
- తప్పుడు ప్రచారాలపై కూటమి ప్రతినిధులు వేగంగా స్పందించాలి
- కేబినెట్ భేటీ అనంతర చర్చలో సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శలొచ్చినా.. బలంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికి సూచించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ తల్లిపై రాహుల్ గాంధీ విమర్శలను సకాలంలో తిప్పికొట్టాల్సి ఉందన్నారు. కూటమి పార్టీలుగా పరస్పరం సహకరించుకుంటూ.. ఎవరిపై ఎలాంటి విమర్శ వచ్చినా సమర్థంగా తిప్పికొడదామని నిర్ణయించారు. కిలేడీ అరుణ వ్యవహారంలో అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడంవల్లే నేతలు నింద పడాల్సి వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. అరుణ.. రౌడీషీటర్ శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించిన ఘటనలో అధికారులు కూడా స్పందించి ఉండాల్సిందన్నారు. సుగాలి ప్రీతి అంశంలోనూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై అధికారులు మాట్లాడితే బాగుండేదని మనోహర్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని నిర్ణయిస్తూ.. ఈమేరకు ఆ సంస్థ డైరెక్టర్కు లేఖ రాయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజే సీబీఐకి ఆ లేఖ రాయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. 2017, ఆగస్టు 18న సుగాలి ప్రీతి మృతి చెందింది. కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. దీంతో సుగాలీ ప్రీతి ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. కానీ దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. దాంతో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని కూటమి నేతలు గతంలో ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రీతి కేసును మరోసారి సీబీఐకి ప్రభుత్వం అప్పగించింది. వివిధ అంశాలపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యూరియా విషయంలో ప్రభుత్వం వద్ద నిల్వలుండి కూడా రైతులకు అడ్జస్ట్ చేయలేక పోతున్నామని అన్నారు.
ప్రస్తుతం యూరియాను అన్ని ప్రాంతాలకు పంపుతున్నారని పేర్కొన్నారు. మనవద్ద యూరియా ఉంది.. కానీ ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారంపై దృష్టి పెట్టి.. దానిని కంట్రోల్ చేయాలని సీఎం ఆదేశించారు. సోషల్ మీడియా అడ్మిన్కు బాధ్యత ఉండే విధంగా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. యూరియా పంపిణిపై వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారంపై మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సైతం స్పందించాలని స్పష్టం చేశారు. ఇది మనందరి బాధ్యతగా పరిగణించాలని ముఖ్యమంత్రి సూచించారు. కుప్పంలోని కాలువలోకి నీళ్లు రావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఫేక్ గ్యాంగులు చేస్తున్న అసత్య ప్రచారంపై చర్చ సాగింది. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారని, దీన్నే జనం నమ్మి మోసపోయే ప్రమాదముందన్నారు. జనం సమ్మే వరకు పరిస్థితి వెళ్లనివ్వకూడదంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు గట్టిగా ఆదేశించారు. మనం జాగ్రత్తగా ఉంటే.. ఇటువంటి అసత్య ప్రచారాన్ని ముందుగానే గుర్తించి కంట్రోల్ చేయొచ్చని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
భవనాల క్రమబద్ధీకరణ విషయంలో ఇకముందు జాగ్రత్త వహించాలని సీఎం స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేసి భవనాలు క్రమబద్ధీకరణ చేయమని అడిగితే ఎలా? అని సీఎం చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం సెప్టెంబర్ 10న నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంపై మంత్రులతో కమిటీని పార్టీ హైకమాండ్ వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు విలేజ్ మార్ట్లు రద్దు చేయాలంటూ ఈ-కేబినెట్ సమావేశానికి ముందు విద్యా, ఐటీ మంత్రి నారా లోకేశ్ను కలిసి హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.