- ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా సలహాలు అడిగాం
- వక్ఫ్ ఆస్తులు అమ్ముతున్నామనేది అబద్ధ ప్రచారం
- వక్ఫ్ బోర్డు మూడేళ్ల కాలపరిమితితో మాత్రమే లీజుకిస్తుంది
- 200మంది విద్యార్థులను ఐఐటీ, ఐఐఎమ్ కోర్సుల్లో చదివిస్తాం
- రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): వక్ఫ్ బోర్డు ఆస్తులు అమ్ముతున్నామనే ప్రచారం అబద్ధమని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. వన్ టౌన్‌లోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆలోచించి నిర్ణయాలు చేస్తామన్నారు. 69 వేల ఎకరాల పైచిలుకు వక్ఫ్ బోర్డు భూములుండగా.. అందులో 36వేల ఎకరాల భూములు ఆక్రమణలో ఉన్నాయన్నారు. మిగిలిన భూములనుంచి వచ్చే రెవెన్యూ ద్వారానే వక్ఫ్ బోర్డు ఉద్యోగులకు జీతాలు, పేద ముస్లింలకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఏ పని చేయాలన్నా నిధులు అవసరం ఎంతైనా ఉంటుందన్నారు.
ఏపీ వక్ఫ్ బోర్డు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయం పెంచేందుకు ఖాళీగా ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ ఇవ్వమని వివిధ సంస్థలను కోరామన్నారు. అందుకు చాలా సంస్థలు ముందుకురాగా.. ముఖ్యంగా యూకే, దుబాయ్ దేశాల నుండి వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారన్నారు. అలా ఐడియాలు ఇచ్చిన సంస్థలు, వాటి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే వారి సూచనలనుబట్టి తర్వాత టెండర్లకు వెళ్లటమా? లేదా? అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వక్ఫ్ బోర్డు ముందుకు వెళ్తుందన్నారు. ఉమ్మడి ఏపీలో వక్ఫ్ బోర్డు కోస్తా అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు.
గతంలో ముస్లింలకు వివిధ పథకాలు కావాలంటే వక్ఫ్ బోర్డునుంచి వస్తాయి అనుకునే వాళ్ళమన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయం ఎలా పెంచాలా? అని అధికారులతో సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఉండేవన్నారు. ఈ రోజుకి వక్ఫ్ బోర్డు ఆస్తులు, రికార్డులు తెలంగాణలోనే ఉన్నాయని, 70 శాతం నిధులు అక్కడే ఆగిపోయాయన్నారు. నేను చైర్మన్ అయిన తరువాత తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను కలవటం జరిగిందన్నారు. రంజాన్ అయిన తర్వాత మీరు అధికారికంగా డెలిగేషన్‌తో రావాలని వారు చెప్పారన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కావటానికి ముఖ్య కారణం ఈ ఆస్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవటమేనన్నారు. ముఖ్యమంత్రి మాకు ఒకటే చెప్పారని.. హిందూ దేవాలయాల ఆస్తులు ఏవిధంగా కాపాడుతారో అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులనూ కాపాడాలని ఆదేశించారన్నారు.
ముస్లిం బిడ్డలు కార్పొరేట్ విద్యలు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారని, వారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించి కార్పొరేట్ విద్యను అందిస్తామన్నారు. 200మంది పేద ముస్లిం వర్గానికి చెందిన 10వ తరగతి పాస్ అయిన పిల్లలకు టాలెంట్ టెస్ట్ నిర్వహించి ఇంటర్‌లో కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామన్నారు. ఆపైన ఐఐటీ, ఐఐఎమ్ చదివించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లోనూ విద్యార్థులకు శిక్షణ అందిస్తామన్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి రెంట్స్ తక్కువగా వస్తుందని, నికరంగా అన్ని టాక్స్‌లుపోను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు 6శాతం మాత్రమే వస్తుందన్నారు. వక్ఫ్ బోర్డ్‌కు సంబంధించి వచ్చే అద్దెలపై రెంట్ రివ్యూ కమిటీ వేయాలన్నారు. చిన్న చిన్న షాపులకు రూ.200, 300ల అద్దె ఇచ్చే పరిస్థితి నేడు ఉందన్నారు. వేరు వేరు సంస్థల పేర్లు మీద వక్ఫ్ ఆస్తులు ఉన్నాయన్నారు. మసీదులకు మా తాతలు ధర్మకర్తలుగా ముతావల్లీలుగా వున్నారని వాళ్లు 11 నెలలు వరకు వక్ఫ్ బోర్డు ఆస్తులు లీజుకు ఇవ్వొచ్చని, వక్ఫ్ బోర్డు 3 ఏళ్లకు లీజు ఇచ్చే అవకాశం ఉందని, మూడు ఏళ్ళు పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇస్తుందన్నారు.
వక్ఫ్ బోర్డు ఆస్తులు దేవుడి ఆస్తులని ఎవ్వరికీ అమ్మటం కుదరదని, కేవలం లీజుకి మాత్రమే ఇస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తి అంటే దేవుడి ఆస్తి అని దానికి బోర్డు చైర్మన్, సభ్యులు ధర్మకర్తలుగా మాత్రమే ఉంటామని, అంతేకాకుండా ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత మాపై ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తితో చూసినట్టు వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా అలాగే చూస్తారని, ముఖ్యమంత్రి నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముకానివ్వనన్నారు. పీఎంజేవీకే కింద స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, సోలార్ ప్రాజెక్ట్స్ నిర్మించేందుకు 60శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందన్నారు.
దేవుడి ఆస్తి కాపాడి పేద ప్రజలకు మేలు చేయాలనే ఆశతో ఉన్నామన్నారు. ఏప్రిల్ 1నుండి వక్ఫ్ బోర్డు లావాదేవీలన్నీ ఆన్ లైన్‌లోనే నిర్వహిస్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డునుంచి వచ్చే ఆదాయం నుంచే సిబ్బంది జీత భత్యాలు చెల్లించాల్సి ఉందన్నారు. కమర్షియల్ భూములను ఖాళీగా ఉంచకుండా లీజ్‌కు ఇవ్వడంవల్ల వక్ఫ్ బోర్డుకు ఆదాయం వస్తుందన్నారు. లీజు ఆస్తులపై వచ్చే రెవెన్యూ మాత్రం ముస్లిం మతానికి చెందిన పేదలు, వితంతువులు, అనాధలకు మాత్రమే అందిస్తామన్నారు. మంచి చేయాలనే సంకల్పంతో ఉన్న వక్ఫ్ బోర్డుకు అందరూ సహకరించాలని కోరుతున్నానని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలియజేశారు.