- కేంద్ర, రాష్ట్రాల సమగ్ర కార్యాచరణ
- ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధుల చర్చలు
- విశాఖ ఉక్కు.. రాష్ట్రానికి భావోద్వేగ అంశం
- పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది
- సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
- నిర్వహణ వ్యయం తగ్గించుకుని, సమర్థత, సామర్థ్యం పెంచుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచన
అమరావతి (చైతన్యరథం): వైజాగ్ స్టీల్‌ప్లాంట్ బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని సీఎం నివాసంలో చర్చలు జరిపింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్‌ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత, తదనంతర పరిణామాలపైనా, తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ…రాష్ట్ర ప్రత్యేక రక్షణదళం(ఎస్పీఎఫ్)తో ప్లాంట్‌కు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు, 3వ ఫర్నేస్‌ను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలపై ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్(ఆర్‌ఐఎన్‌ఎల్)తో తమ రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసేందుకు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, ఆర్థిక సాయం ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఉక్కు కర్మాగారానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పారు. ఇందుకు అవసరమైన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించుకోవడంతో పాటు, సమర్థత, సామర్థ్యం పెంచుకోకపోతే ఆశించిన ఫలితాలు రావని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్‌ఎండీ సీఎండీ అమితవ ముఖర్జీ, ఆర్‌ఐఎన్‌ఎల్ ఇన్చార్జ్ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సీఎండీ ఎస్కే వర్మ, ఎంఎస్‌టీసీ లిమిటెడ్ సీఎండీ మనోబేంద్ర ఘోషల్ పాల్గొన్నారు.