- సమర్థవంతంగా రోడ్ల నిర్వహణ
- పాత్ హోల్ ఫ్రీ రహాదారులే ప్రాధాన్యత
- ‘స్టేట్ ఫస్ట్ -డెవలప్మెంట్ ఫస్ట్’
- ప్రజాప్రతినిధులు చురుకుగా వ్యవహరించండి
- ఆర్ అండ్ బి సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ `ఏపీ లింక్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని రహదారులను గుంతలు లేకుండా తీర్చిదిద్దడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని సీఎం స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ‘‘ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ-లింక్ సంస్థ ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పటినుంచే దీనిపై ప్రణాళికలు రూపొందించాలి. లాజిస్టిక్స్ కార్పొరేషన్‌ను బలోపేతం చేసే క్రమంలో రహదారులు భవనాల శాఖకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాలను ఎంత వరకు వినియోగించుకోవచ్చో చూడాలి. లాజిస్టిక్స్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తే సంస్థ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మార్గం సుగమమవుతుంది. అప్పుడు రాష్ట్రంలోని రహదారుల నెట్ వర్క్‌తోపాటు ఇతర మౌలిక సదుపాయాలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు’’ అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రోడ్ల నిర్మాణంలో నాణ్యత… ఇంజనీర్లకు జవాబుదారీతనం
‘‘రోడ్ల నిర్మాణం, నిర్వహణ, పాత్స్ హోల్స్ ఫ్రీవంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లే లక్ష్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా చూసుకోవాలి. అలాగే కాంట్రాక్టర్లు ఏదైనా తప్పు చేసినా… నాణ్యతలో రాజీపడినా అలాంటి కాంట్రాక్టర్లను గుర్తించాలి. ఇక ఇంజనీర్లు కూడా జవాబుదారీతనంతో పనిచేయాలి. ఈ ఏడాది మార్చిలో ఆమోదించిన రోడ్ల నిర్వహణ, పాత్ హోల్స్ పనులు 10నుంచి 15 శాతంమేర పూర్తయ్యాయి. అలాగే ఇటీవలే ఆమోదించిన పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోండి. ఇప్పటి వరకు ఆమోదాలు పొందిన పనులు వచ్చే ఏడాదికి పూర్తయ్యేలా చూడాలి. అలాగే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలి. దీని కోసం డ్రోన్లు, లైడార్ సర్వే అవసరమైతే శాటిలైట్ సర్వేల ద్వారా రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న అంశాలను పరిశీలించటంతోపాటు పనులు ఏవిధంగా జరుగుతున్నాయోననే విషయాన్ని గుర్తించాలి. దీని కోసం టెక్నాలజీని వినియోగించుకోవాలి. మొంథా తుఫానులో నష్టపోయిన రోడ్లు, బ్రిడ్జిల పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఇప్పటికే కొన్నింటిని చక్కదిద్దాం. పెండిరగులో ఉన్న పనులనూ వెంటనే చేపట్టాలి. పీపీపీ విధానంలో చేపట్టనున్న రోడ్ల జాబితా వెంటనే సిద్ధం చేయాలి. నిబంధనల ప్రకారం వయబులిటీ గ్యాప్ ఫండిరగ్ ఏయే రోడ్లకు ఇవ్వగలమనేది పరిశీలించాలి. వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణంపై పైలెట్ ప్రాజెక్టులు చేపట్టాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నేషనల్ హైవేల పనుల్లో జాప్యం తగదు
‘‘రాష్ట్ర రోడ్లతోపాటు… నేషనల్ హైవేల విషయంలోనూ అధికారులు దృష్టి పెట్టాలి. నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. భూసేకరణ మొదలుకుని ఇతర అంశాల్లో కేంద్రానికి పూర్తిగా సహకరించాలి. ఏమాత్రం జాప్యం జరగడానికి వీల్లేదు. అలాగే ‘స్టేట్ ఫస్ట్… డెవలప్మెంట్ ఫస్ట్’ అనే విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తించాలి’’ అని సీఎం చంద్రబాబు వివరించారు. సమీక్షకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.











