- జగన్ చెప్పిట్లే ఏపీ ఫలితాలను చూసి దేశం ఆశ్చర్యపోయింది
- జగన్ దుర్మార్గపు పాలనను ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించారు
- ఎన్నో చేసినా ప్రజలు మోసం చేశారన్న వైసీపీ సోషల్ మీడియా ప్రచారం హేయం
అమరావతి(చైతన్యరథం): ప్రజలే తనను మోసం చేశారంటూ జగన్ రెడ్డి మాట్లాడటం కంటే సిగ్గుమాలిన, హేయమైన చర్య ఇంకోకటి లేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రజా తీర్పుపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్ అరాచక, నిరంకుశ, నియంతృత్వ పాలనను కూకటి వేళ్లతో ప్రజలు పెకిలించారన్నారు. జగన్ చెప్పిట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు.. 5 కోట్ల ఆంధ్రుల విజయమని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మల మాట్లాడుతూ నీతిలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డే అన్నారు. అమ్మఒడి ఇచిన అమ్మలు, పింఛన్లు తీసుకున్న అవ్వాతాతలు మోసం చేశారనడం దారుణం. గత ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చినట్లుగా ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రత్యేకహోదా సాధించలేదు, సీపీఎస్ రద్దు చేయలేదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు, అందుకే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను జగన్ రెడ్డి మోసం చేసినందుకే ఈ తీర్పు ఇచ్చారు. ఆ వర్గాల ప్రజల హత్యలు, వారిపై అత్యాచారాలు, అరాచకాలు జరుగుతున్నా జగన్ రెడ్డి నోరు మెదపనందుకే ఈ దుష్ట పాలనను ప్రజలు ఓట్లతో అధ:పాతాళానికి తొక్కేశారు. రాజధాని పేరుతో మూడుముక్కలాటాడి రాజధానికి ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకే జగన్ రెడ్డిని ఘోరంగా ఓడిరచారు. ఏపీకి జీవనాడిగా మారే పోలవరాన్ని గోదావరిలో ముంచినందుకే వైసీపీని ప్రజలు పాతిపెట్టారు. పాలకులు అనే వాళ్లు యజమానులు కాదు సేవకులు అనే వాస్తవాన్ని మరిచిపోయి జగన్ రెడ్డి ఒక హిట్లర్, ముసోలిని, ముషారఫ్‌లను మించిన నిరంకుశ, నియంతృత్వ పాలనను సాగించాడు. అందుకే ప్రజాగ్రహంలో జగన్ రెడ్డి కొట్టుకుపోయాడు. మళ్లీ ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా మాట్లాడటం సిగ్గుమాలిన చర్య. ప్రజలు విజ్ఞతతో ఓట్లు వేస్తే ఆ విజ్ఞతను ప్రశ్నేంచేలా, నిందలు వేసేలా మాట్లాడటం దారుణం. తన తప్పిదాలు, తన చేతగాని తననాన్ని ప్రజలమీద నెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. మేనిఫెస్టో 99 శాతం అమలు చేశానని పదే పదే అబద్ధం చెబితే అది నిజం కాబోదని జగన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని నిమ్మల హితవు పలికారు.
అన్నీ అబద్ధాలే
జగన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు ఏం చెప్పాడు… వచ్చాక ఏం చేశాడు? 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు.. రాజ్యసభతో కలిసి మొత్తం 31 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు. వారంలో సీపీఎస్ రద్దు అన్నాడు ఆ హామీనే తుంగలో తొక్కాడు. ప్రతి సంవత్సరం డీఎస్సీ, మెగా డీఎస్సీ అన్నాడు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఐదు జనవరులు పూర్తయినా ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. పోలవరాన్ని 2020 జూన్‌కు పూర్తి చేస్తామని ఒకసారి, 2021 అగస్టుకు పూర్తి చేస్తానని మరోసారి, 2022 డిసెంబర్ అని మరోసారి మాట మారుస్తూ పోయి పోలవరాన్ని ఎలా ముంచారో ప్రజలందరికీ తెలుసు. ప్రతి పక్ష నాయకుడిగా అమరావతిని స్వాగతిస్తున్నానని అంగీకరించి, అప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలుండాలని చెప్పిన జగన్ రాజధానికి ఒక్క ఇటుక వేయక పోగా 3 మూడు ముక్కల ఆట ఆడి అమరావతిని ధ్వంసం చేశాడు. అధికారంలోకి వచ్చిన వారంలో ప్రజా వేదికను కూల్చి రాష్ట్రంలో విధ్వంస పాలన ప్రారంభించాడు. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం చంద్రబాబు అమలు చేసిన 138 సంక్షేమ పథకాలు రద్దుచేశాడు. సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించి దోచుకున్నాడు. అన్న క్యాంటీిన్‌లను రద్దు చేసి పేదల పొట్టకొట్టాడు. పెళ్లికానుక రద్దుచేసి ఆడబిడ్డలకు అన్యాయం చేశాడు. మద్యపాన నిషేదం అని చెప్పి, మద్యం వ్యాపారాన్ని సొంతం చేసుకుని కల్తీ, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు. ఏపీలో మైన్స్‌ను, సహజ వనరులను కొల్లగొట్టారు. విలువలైన ప్రభుత్వ భూములను కొట్టేశారు, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి దోచుకున్నారు. వ్యక్తుల ఆస్తులను కొల్లగొట్టడానికి ల్యాండ్ టైటింలింగ్ యాక్ట్ తీసుకు వచ్చారు. రోడ్లు అధ్వానంగా ఉన్నా కనీసం గుంతలు కూడా పూడ్చలేదని నిమ్మల దుయ్యబట్టారు.
దళితద్రోహి జగన్
నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపారు. టీడీపీ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే… జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 24 శాతానికి తగ్గించాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులపై హత్యలు, అత్యాచారాలు, శిరోముండన ఘటనలు లెక్కలేనన్ని జరిగితే కనీసం నోరు విప్పక పోగా.. దళిత బిడ్డను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని వెనకేసువచ్చాడు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. దళితులకోసం చంద్రబాబు అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. రాజధానికోసం రైతులు భూములు ఇచ్చిన మహిళా రైతులను బూట్ల కాళ్లతో తన్నించాడు. ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను ఇలా పన్నులతో జనాన్ని దోచుకున్నాడు. 12,900 గ్రామా పంచాయతీలను సంక్షోభంలోకి నెట్టాడు. కేద్రం ఇచ్చిన నిదులు దారి మళ్లించి సర్పంచ్‌లను భిక్షాటన చేసే స్థితికి తీసుకు వచ్చాడు. కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులు తప్పించి వైసీపీ ప్రభుత్వం ఒక్కరూపాయి సాయం కూడా చేయలేదు. పక్క రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చిన వెయ్యికి నాలుగు వేల నుండి ఐదు వేల వరకు ఇచ్చి ఆ రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకున్నారు. ఇక్కడేమో కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదు. వైసీపీ పాలనలో వరి రైతులు, ఆక్వా రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించాల్సిన దుస్థితి నెలకొందని నిమ్మల అన్నారు.
దోచుకోవడానికే రాజకీయాల్లోకి
జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు కూడబెట్టుకోవడానికే తప్పించి, ప్రజలకు సేవ చేయడానికి కాదు. 2004 ఎన్నికల్లో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో జూబ్లీహిల్స్‌లో చిన్న ఇల్లు, రెండు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ అని చూపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల కోట్లు ఎలా వచ్చాయి? తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి దోచుకున్నాడు. 2019లో కూడా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత శ్యాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్‌తో ఎక్కడికి అక్కడ ఆదాయాన్ని పంచుకుని దోచుకున్నారు. రాష్ట్రాన్ని భాగాలుగా విభజించి దోచుకోవడానికి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలాంటి నాయకులను పెట్టుకున్నాడు. అందుకే ప్రజలు వైసీపీకి ఘోర ఓటమిని ఇచ్చారు. ఐదేళ్లు అబద్ధాలను నమ్ముకున్న ఈ జగన్ రెడ్డి ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత కూడా అబద్ధాలే మాట్లాడారు. ఎవరైనా కొనఊపిరితో ఉన్నప్పుడు నిజమే చెబుతారు. జగన్ ఊపిరి పోతున్నా నిజం మాట్లాడలేకపోతున్నాడు. ఘోర ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజల మీద నిందలు వేయడం, ప్రజలపై అక్కసు వెళ్లగక్కడం చాలా హేయమైన చర్య. నేను బటన్ నొక్కుతున్నా.. మీరు కూడా బటన్ నొక్కమంటే … ఈ ఐదేళ్ల అరాచక, కక్షపూరిత, నిరంకుశ, నియంతృత్వ అవినీతి పాలనకు సరైన బటన్ నొక్కి జగన్‌ను అధ:పాతాళానికి తొక్కి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా జగన్ నియంతృత్వ, నిరంకుశ పోకడలు విడనాడి ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోవాలని నిమ్మల హితవు పలికారు.
ప్రజాతీర్పును కించపరచడమే
ఈవీఎంల తీర్పుపై వైసీపీ నేతల మాటలు ప్రజల తీర్పును కించపరచడమే. ప్రజలు చాలా కసితో ఓట్లు వేశారు. 1983లో టీడీపీ ఆవిర్భవించినప్పుడు కూడా లేని ప్రభంజనం 2024 లో కనిపించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత చెత్తగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని ప్రజలు తీర్పుతోనే అర్థం అవుతోంది. ఐదేళ్లపాటు తాడేపల్లి ప్యాలెస్‌ను వదిలి జగన్ రెడ్డి అడుగు బయటపెట్టలేదు. శాసనసభ్యులెవరికీ జగన్ రెడ్డిని కలవడానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ జగన్ ప్యాలెస్ దాటి అడుగు బయటపెడితే పరదాల చాటున, పోలీసుల భద్రతతో వచ్చిన పరిస్థితి. అభివృద్ధి సంక్షేమం మీద జగన్ రెడ్డి ఒక్కరోజు కూడా దృష్టి పెట్టలేదు. జగన్ ధ్యాసంతా ఇసుకలో, మందులో, మట్టిలో ఎలా దోచుకోవాలనదానిపైనే. అందుకే ప్రజలు ఇంత విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. నాయకుడు ఎప్పుడూ ప్రజలతో మమేకం కావాలి. ప్రజల సమస్యల సమస్యలను పట్టించుకోవాలి. ప్రజల్లో ఉండాలి. దాన్ని జగన్ రెడ్డి మరిచాడని నిమ్మల దుయ్యబట్టారు.