- గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి
- రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పనిచేయండి
- ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదన
- గ్రిఫిత్ వర్శిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్‌తో భేటీ
ఆస్ట్రేలియా (గోల్డ్ కోస్ట్): గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ గోల్డ్ కోస్ట్ క్యాంపస్‌లో భేటీ అయ్యారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. గ్రిఫిత్ వర్సిటీ ప్రత్యేకతలను మార్నీ వాట్సన్ తెలియజేస్తూ… 1975లో స్థాపితమైన తమ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందన్నారు. క్వీన్స్ ల్యాండ్‌లో యూనివర్సిటీకి ఉన్న ఐదు క్యాంపస్‌లలో 50వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. సామాజిక న్యాయం, స్థిరత్వం, ఆవిష్కరణ రంగాల్లో పేరుగాంచిన తమ వర్శిటీ.. 2027లో బ్రిస్బేన్ సీబీడీలో కొత్త క్యాంపస్ ప్రారంభించబోతోందని వెల్లడిరచారు. భారత్‌లో ఐఐటీ రూర్కీతో కలిసి సంయుక్త పరిశోధన, స్టూడెంట్ ఎక్స్చేంజి కార్యక్రమాలు, ఆరోగ్యం, నీటివనరులు, టెక్నాలజీ రంగాల్లో అకడమిక్ భాగస్వామ్యం వహిస్తున్నట్టు మంత్రి లోకేష్‌కు మార్నీ వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఏపీ`గ్రిఫిత్ భాగస్వామ్య ఏర్పాటుకు చొరవ చూపాలని ప్రతిపాదించారు. ‘‘పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్‌ను ఏపీలో ఏర్పాటు చేయండి. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధృవీకరణ, గ్లోబల్ అకడమిక్ ప్రమాణాల కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, ఏపీఎస్‌ఎస్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్)తో భాగస్వామ్యం వహించండి. పునరుత్పాదక శక్తి, వాతావరణ స్థితిస్థాపకత, ప్రజారోగ్యం, నీటి నిర్వహణ రంగాల్లో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభించండి. గ్రిఫిత్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ విద్యాసంస్థల మధ్య డ్యూయల్-డిగ్రీ లేదా ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను (ఉదా: ఎస్‌ఆర్‌ఎం`ఏపీ, ఆంధ్రా యూనివర్సిటీ, విఐటి`ఏపీ.. స్కాలర్‌షిప్‌లు, అధ్యాపకులు, విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్చేంజి కార్యక్రమాలను ప్రోత్సహించడం) అభివృద్ధి చేయండి. ఈ ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో ఏపీలో నిర్వహించే పార్టనర్‌షిప్ సమ్మిట్ `2025, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫోరమ్ సమావేశాలకు హాజరుకండి. గ్రిఫిత్ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, స్టార్టప్ మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలసి పనిచేయొచ్చు’’ అని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు.













