- ప్రాజెక్టు పూర్తితోనే నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం
- పెండిరగ్ డిజైన్స్‌కి వెంటనే అనుమతులు ఇవ్వాలి
- లక్ష్యానికి ముందే ప్రాజెక్ట్ పూర్తికి సహకరించండి
- నిపుణుల బృందంతో మంత్రి నిమ్మల
పోలవరం (చైతన్యరథం): రాష్ట్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి అవినాభావ సంబంధం ఉందని విదేశీ నిపుణుల బృందానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అలాగే జాతీయస్థాయిలో నదుల అనుసంధానానం, పోలవరం ప్రాజెక్టు విడదీయలేని పరస్పర ఆధార ప్రాజెక్టులుగా మంత్రి అభివర్ణించారు. అందువల్లనే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలవరం పై ప్రత్యేక దృష్టి నిలిపారని మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను, అవసరాన్ని నిపుణుల బృందానికి తెలియజెప్పారు. ముందు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల మీరంతా సహకరించి లక్ష్యాని కంటే ముందుగా పూర్తయ్యేటట్లు ప్రయత్నించాలని కోరారు. ఎగువ కాఫర్ డ్యామ్ బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యామ్, గ్యాప్-2 డి వాల్ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. నిపుణుల బృందంతో మాట్లాడి సాంకేతిక వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని నిపుణుల బృందం దృష్టికి మంత్రి తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన విషయాన్ని వారికి గుర్తు చేశారు.
అలాగే అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో మూడుసార్లు పోలవరం ప్రాజెక్టుని ఆయన సందర్శించారన్నారు. అంతేకాకుండా పనుల షెడ్యూల్‌ని నిర్ణయించి ప్రతి 15 రోజులకు ఓసారి సచివాలయంలో సమీక్షిస్తున్నారన్నారు. అందువల్లనే పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి.. పోలవరం ప్రాజెక్ట్ పైనే ఆధారపడి ఉందన్న అంశాన్ని మంత్రి వారికి విశదీకరించారు. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే కరువు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ కు గోదావరి జలాలు తరలించడం సాధ్యం అవుతుందన్నారు. ఇప్పటికే గ్యాప్-2 లో డి వాల్ నిర్మాణం పనులు, ఎగువకాఫర్ డ్యామ్ బలోపేతం చేయడానికి వీలుగా నిర్మిస్తున్న బట్రస్ డ్యామ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. గ్యాప్ -1, గ్యాప్ -2,తో పాటు మిగిలిన పనులకు సంబందించిన డిజైన్స్‌కు, త్వరితగతిన అనుమతులు ఇస్తే, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయగలుగుతామని నిపుణుల బృందాన్ని మంత్రి నిమ్మల కోరారు. ప్యానల్ అఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ, సిడబ్ల్యూసి, పిపిఏ, ఆఫ్రి, నిర్మాణ ఏజెన్సీలు సమన్వయం తో పని చేస్తూ లక్ష్యానికి ముందే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని మంత్రి రామానాయుడు సూచించారు.