- త్వరలోనే మనమిత్ర ద్వారా అందుబాటులోకి ల్యాండ్ రికార్డులు
- ఫిబ్రవరిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం
- చంద్రబాబుకు ఇష్టమైంది క్వాంటమ్ కంప్యూటర్ ప్రాజెక్టు
- సీఎం విజన్ సాకారానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం
- పూణే పబ్లిక్ పాలసీ ఫెస్టివల్ లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్
పూణే/మహారాష్ట్ర (చైతన్యరథం): ఆంధ్రపదేశ్‌లో గత ప్రభుత్వం పీపీఏలను రద్దుచేయడంతో 2019-24 మధ్య భయపడి చాలా కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయి.. అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం.. ప్రజలు ఈ విషయంలో చైతన్యవంతులు కావాల్సి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పూణేలో గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్ సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో మంత్రి లోకేష్ కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ఫెస్టివల్ కోకన్వీనర్ సిద్ధార్థ్ దేశాయ్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పరిశ్రమల గ్రౌండిరగ్‌కు సంబంధించి రెండేళ్లలో పురోగతి చూపిస్తామన్నారు. ఆ తర్వాత వచ్చే పరిశ్రమలు గ్రౌండ్ అయ్యే సరికి మళ్లీ ఎన్నికలు వస్తాయి. 1995, 99లలో వరుసగా రెండుసార్లు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడం వల్ల హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, ఐఎస్బి వంటి ఎన్నో సంస్థలు ఏర్పాటై నేడు లక్షలాదిమంది యువతకు ఉపాధి చూపుతున్నాయి. ప్రభుత్వ కొనసాగింపు ఆవశ్యకతను ప్రజల గుర్తించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు.
మనమిత్ర ద్వారా సులభతరమైన సేవలు
గవర్నెన్స్ లో టెక్నాలజీని తీసుకువచ్చి ప్రజలకు చేరువ చేస్తున్నాం. ప్రభుత్వ పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమేగాక, వారికి మెరుగైన సేవలందించడానికి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ను విజయవంతంగా అమలుచేస్తున్నాం. దీనిద్వారా 36శాఖలకు చెందిన వెయ్యి రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. జనరేటివ్ ఏఐ ప్లాట్ ఫాంను ఉపయోగించి మెరుగైన సేవలందించేందుకు కృషిచేస్తున్నాం. ప్రస్తుతం భారత్‌లో వాట్సాప్ శకం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మేం అందిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ జాతీయస్థాయిలో ప్లాట్ ఫాం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. మా ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో స్కిల్ సెన్సస్ను తొలుత సాంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్ గా చేయాలని నిర్ణయించాం. ప్రాక్టికల్‌గా ఇది కష్టతరమైంది. దీంతో ఏఐని ఉపయోగించి విజయవంతంగా సులభతర విధానంలో స్కిల్ సెన్సస్ చేపట్టాం. ఈ విధానంలో కేవలం సప్లయ్ -డిమాండ్ అగ్రిగేషన్ మాత్రమే కాదు, కాన్వర్సేషనల్ ఏఐతో కార్పెంటర్, ఏసీ మెకానిక్ తదితరుల్లో స్కిల్ స్థాయిని అంచనా వేస్తున్నాం. మంగళగిరిలో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను త్వరలో విజయవంతంగా పూర్తిచేస్తాం. మార్చిలో ఇండియా ఏఐ కాన్ఫరెన్స్‌కు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. నైపుణ్యం పోర్టల్ ద్వారా మాక్ ఇంటర్వ్యూలు సైతం నిర్వహిస్తాం. భారత్‌లో ల్యాండ్ రికార్డ్స్ అతిపెద్ద సవాలు. దీనికి ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు మేం ఏఐ వినియోగం ద్వారా ల్యాండ్ రికార్డులన్నీ బ్లాక్ చైన్ మీదకు తీసుకువస్తున్నాం. దీనివల్ల ట్రేసబిలిటీ సులభతరమై, 24గంటల్లో టైటిల్ మార్పుచేసి భూ యజమానికి అందించే విధంగా మేం కసరత్తు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
ఆ మూడు కారణాల వల్లే పరిశ్రమల ప్రవాహం
గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి బడా కంపెనీలు ఆంధ్రాకు క్యూకట్టడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది నిరూపితమైన నాయకత్వం. మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సైబరాబాద్ నిర్మాణం చేపట్టి, హైదరాబాద్‌ను ఐటీ డెస్టినేషన్ గా తయారుచేశారు. ఇప్పుడు అదేవిధానంలో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మ్యాజిక్ చేస్తున్నారు. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకసారి ఏదైనా పరిశ్రమ ఏపీతో ఎంవోయూ కుదుర్చుకున్నాక ఆ ప్రాజెక్టును మా సొంతదిగా భావించి, ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ కు వారితో కలిసి పనిచేస్తున్నాం. అతితక్కువ సమయంలో అన్నిరకాల అనుమతులు ఇస్తున్నాం. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ అలాగే ఏపీకి వచ్చింది. నేను ఆదిత్య మిట్టల్‌తో ఒకేఒక జూమ్ కాల్ మాట్లాడి, వారు చెప్పిన సమస్యను 24గంటల్లో పరిష్కరించి దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏపీకి రప్పించా. ఫిబ్రవరిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుడతాం. మూడోది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నమో (నాయుడు ` మోదీ) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్ తో పనిచేస్తోంది. గతంలో వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు కేంద్రంలో పాలసీ రిఫామ్స్కు ఎంతో కంట్రిబ్యూషన్ అందించారు. ఇప్పుడు నరేంద్రమోదీ నేతృత్వంలో మళ్లీ అదేతరహా పాత్ర పోషిస్తున్నారు. పై మూడు కారణాలతో ఆంధ్రప్రదేశ్ పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోందని మంత్రి లోకేష్ వివరించారు.
పరిశ్రమల అనుమతుల కోసం లిఫ్ట్ పాలసీ
పారిశ్రామిక సంస్థలను రప్పించేందుకు మేము అమలు చేస్తున్న ‘లిఫ్ట్’ పాలసీ ఉదారమైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్‌లో కావాల్సినంత టాలెంట్ పూల్, వాటర్, పవర్ అందుబాటులో ఉంది. అయితే భూమి చాలా ఖరీదైంది. గత దావోస్ సమావేశంలో కాగ్నిజెంట్ అధినేత రవికుమార్ ఇదే విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. ఒక ఎకరాకు 500 ఉద్యోగాలు కల్పించే ప్రాతిపదికన ఎకరా 99పైసలకే భూమి ఇస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను కేబినెట్ ముందుకు ఈ అంశాన్ని తీసుకెళ్లినపుడు 99పైసలకు భూమి ఇస్తే పరిశ్రమలు వస్తాయా అని ముఖ్యమంత్రి నన్ను అడిగారు. నేను రప్పించగలనని చెప్పడంతో కాగ్నిజెంట్‌కు భూమి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఆ తర్వాత ఫ్లడ్ గేట్స్ మాదిరి పరిశ్రమల ప్రవాహం మొదలైంది. తొలుత ఐటి కంపెనీల కోసం పాలసీ ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేశాం. అయితే ఆర్సెలర్ మిట్టల్ వంటి సంస్థలకు మార్కెట్ రేటుకే భూమి కేటాయించాం. ఐటీ రంగంలో ఒక జాబ్ వస్తే, పరోక్షంగా మరో 5 ఉద్యోగాలు తోడవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. స్పేస్ ప్రాజెక్టుకు సంబంధించి మరొక కంపెనీకి తక్కువ ధరకు భూమి ఇస్తే, కొందరు కోర్టులో పిల్ ఫైల్ చేశారు. ప్రజాప్రయోజనం దృష్ట్టా మా నిర్ణయాన్నే కోర్టు సమర్థించింది. పరిశ్రమలను రప్పించే విషయంలో మా అధినేత చంద్రబాబు చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆలోచన మాకు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ నుంచి వచ్చింది. ఒకరోజు నేను ఆయనతో కారులో ప్రయాణిస్తున్నపుడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనుమతులు ఆరునెలలు ఆలస్యమైతే బిజినెస్ ప్లాన్స్ అన్నీ తారుమారు అవుతాయని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు మా మనసులో నాటుకుపోయాయి. వెంటనే ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించాను. ఆయన వెంటనే స్పందించి వేగవంతంగా అనుమతులిచ్చేలా యంత్రాంగానికి ఆదేశాలిచ్చారని మంత్రి లోకేష్ తెలిపారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రస్తుతం మా విధానంగా మారింది. వాట్సాప్ లేదా వెబ్సైట్ ఉన్నా పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించడం ముఖ్యం. ఇందుకోసం సింగిల్ పోర్టల్ తెచ్చి మనమిత్రలో అనుమతులు ఇస్తున్నాం. పరిశ్రమ ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ప్రతి రెగ్యులేషన్, యాక్ట్‌ను ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించిన 26 వాట్సాప్ గ్రూపుల్లో నేను చేరి అనునిత్యం అనుమతులను ఫాలో అప్ చేస్తున్నా. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి మేజర్ ఇన్వెస్ట్ట్మెంట్స్ పై ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా ట్రాక్ చేస్తున్నాం. గ్లోబల్ లీడర్స్ కు సంబంధించి అప్ డేటెడ్ స్టేటస్ రిపోర్టుతో డేటా సెంటర్ నుంచి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు బిజినెస్ స్టేటస్, టైమ్ లైన్స్, రెజిమెంటెడ్ అప్రోచ్, పూర్తిస్థాయి స్టేటస్ రిపోర్టుతో త్వరలో దావోస్ వెళ్తున్నాం. ఎంవోయూ లేకుండానే ప్రాజెక్టు గ్రౌండ్ కావాలన్నది మా లక్ష్యం. ఆర్సెలర్ మిట్టల్‌కు సంబంధించి ఎటువంటి ఎంవోయూ లేకుండానే ప్రాసెస్ పూర్తిచేశాం. వారు చెప్పిన మూడు సమస్యలను కేంద్రంతో మాట్లాడి ఒకరోజు వ్యవధిలోనే పరిష్కరించాం. ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. గూగుల్ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రెగ్యులేషన్, టాక్సేషన్ కు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడారు. అదే పాలసీని అమెజాన్, ఇతర గ్లోబల్ సంస్థలకు కూడా వర్తింపజేస్తాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గేరు మారుస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు.
చంద్రబాబుకు ఇష్టమెన క్వాంటమ్ ప్రాజెక్టు
క్వాంటమ్ వ్యాలీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టమైన ప్రాజెక్టు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఆవిష్కృతమవుతున్న క్వాంటమ్ వ్యాలీ దేశానికే దిక్సూచిగా నిలవబోతోంది. 75ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎనర్జీని అందుకోవడం మాలాంటి వారికి కూడా కష్టమవుతోంది. ఒక టాస్క్ అప్పగించిన తర్వాత 45నిమిషాల వ్యవధిలోనే ఎక్కడివరకు వచ్చిందని అప్ డేట్ అడుగుతారు. ఏపీలో క్వాంటమ్ ఎకోసిస్టమ్ చంద్రబాబు డ్రీమ్. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాసు వంటి సంస్థలను ఏకతాటిపైకి తెచ్చి అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టారు. భారత ఫ్రేమ్ వర్క్, నిధులతో దీనిని అభివృద్ధి చేస్తున్నాం. ఆంధ్ర క్వాంటమ్ మిషన్ అనౌన్స్ అయ్యాక ప్రతి స్టేట్ దీనిపై దృష్టిసారించింది. విద్యాశాఖ మంత్రిగా కరిక్యులమ్ సెటప్ ఏర్పాటుకు కృషిచేస్తున్నా. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక వాల్యూ చెయిన్. స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, కంప్రెస్డ్ బయో గ్యాస్ సిటీ, మెడికల్ డివైసెస్ మాన్యుఫాక్చరింగ్… ఇలా 22 సెక్టార్స్ తో దీనిని అనుసంధానిస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించిన అనుబంధ యూనిట్లన్నీ 100 కి.మీ. రేడియస్‌లో ఉండేలా చర్యలు చేపడుతున్నాం.
విద్యాశాఖ మంత్రిగా కరిక్యులమ్, ఐటిఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల నుంచి బ్లూ కాలర్ ఎంప్లాయీస్ సర్టిఫికేషన్ చేస్తున్నాం. మేము ఆ విధమైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయడం వల్లే ఈరోజు దేశం మొత్తమ్మీద 50శాతం ఏసీలు ఏపీలో తయారవుతున్నాయి. త్వరలోనే 70శాతానికి చేరుకుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్థిరమైన పెట్టుబడులకు మరో కారణం రెన్యువబుల్ ఎనర్జీ. విశాఖ నగరంలో డేటా సెంటర్లకు అవసరమైన రెన్యువబుల్ ఎనర్జీని అతితక్కువ ధరకు మేం ఇవ్వబోతున్నాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా అవసరమైన నీటిని అందజేస్తున్నాం. డేటా సెంటర్స్‌కి మరిన్ని కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ మేం అందజేస్తున్నాం. అందువల్లే ఏపీలో డేటా సెంటర్లపై పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటన్నింటికీ మించి పొలిటికల్ విల్ (రాజకీయ సంకల్పం) ముఖ్యం. గత ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 50శాతం మంది కొత్తవారు. 25మంది మంత్రుల్లో 17మంది తొలిసారి మంత్రి అయిన వారు. ముఖ్యమంత్రి విజన్, ఆలోచనలను అమలు చేసేందుకు మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. గూగుల్ అనుభవంతో భారీ ఎఫ్‌డీఐ లను రాష్ట్రానికి రప్పించేందుకు కృషిచేస్తున్నాం. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం గెలుస్తుంది. ఎఫ్‌డీఐ రాకకు కావాల్సింది పాలసీల స్థిరత్వం. ఇందుకోసం మేం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.













