- రూ.3.2 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టనున్న మంత్రి పయ్యావుల
- అనంతరం వ్యవసాయ బడ్జెట్ పెట్టనున్న మంత్రి అచ్చెన్న
- ముందుగా సీఎం అధ్యక్షతన అసెంబ్లీ ఛాంబర్‌లో కేబినెట్ భేటీ
- మండలిలో ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్లు పెట్టనున్న కొల్లు, నారాయణ
- బడ్జెట్‌లో మూలధన వ్యయం పెరిగే అవకాశం ఉందని అంచనా
- సంక్షేమం, అభివృద్ధి, ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు?
- గంపెడాశలతోవున్న ప్రభుత్వోద్యోగ వర్గాలు
అమరావతి (చైతన్య రథం): 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.25 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ‘సూపర్ సిక్స్’ సంక్షేమ పథకాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ప్రజలకు మరికొన్ని కానుకలు ఉండొచ్చన్న మాటా వినిపిస్తోంది. అలాగే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బడ్జెట్‌లో భారీగా పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ప్రధానంగా.. వైకాపా హయాంలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం.
2025`26వ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసన సభలో బడ్జెట్ పెట్టనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2025`26 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. అనంతరం శాసన సభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రేవేశపెడతారు. అదేవిధంగా.. శాసన మండలిలో రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రత్యేకంగా సేద్యం బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శాసన మండలి ముందు మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ ఉంచుతారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోనే తొలిసారిగా రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ప్రవేశ పెట్టిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. గతేడాది ఫిబ్రవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా… అదే ఏడాది జూలైలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక గందరగోళం నేపథ్యంలో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
2025 ఏప్రిల్ 1నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికిగాను 3.25 లక్షల కోట్లమేర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ‘సూపర్ సిక్స్’ పథకాల అమలులో భాగంగా 2025`26 ఆర్థిక సంవత్సరంలో ‘తల్లికి వందనం’ పథకంతోపాటు రైతులకు ఆర్థిక సాయంగా ‘అన్నదాత సుఖీభవ’, ‘ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం’ పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ పథకం అమలుకు ఇప్పటికే అర్హులను గుర్తించారు. ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం ఇవ్వడానికి సుమారు రూ.10,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మేలో పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా వెల్లడిరచారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకాన్నీ త్వరలోనే అమలు చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం రూ.10,717 కోట్లు అవసరమని లెక్క వేసారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహాయించటం ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ.14 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇందుకు రూ.7,502 కోట్లు అవసరమని తేల్చారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు చేయనుంది. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు చెల్లించడంతో దానికి ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితోపాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్దమొత్తంలో మూలధనం వ్యయాన్ని పెంచే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పేదలతోపాటు మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో కేటాయింపులుండే అవకాశం ఉంది. మధ్యతరగతిపై పన్నులు, విద్యుత్ ఛార్జీల భారం లేకుండా చూసేలా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే అంశంపైనా బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఉపాధి అవకాశాలు పెంచేలా వివిధ పీపీపీ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా నిధులను సైతం ప్రకటించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా వడ్డీలేని రుణాల అంశాన్నీ బడ్జెట్‌లో వెల్లడిరచే అవకాశం లేకపోలేదు. అలాగే, బడ్జెట్‌లో తమకు భారీ ప్రయోజనాలు దక్కే అవకాశాలు లేకపోలేదని ప్రభుత్వోద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోపక్క `వ్యవసాయ బడ్జెట్ రూ.50 వేల కోట్లు దాటే అవకాశం ఉందనీ అంటున్నారు. సంపద సృష్టిలో భాగంగా ప్రకృతి సేద్యాన్ని పెద్దఎత్తున ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగినట్టుగా కేటాయింపులు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అలాగే, బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉప ప్రణాళిక ప్రకటించే ఆస్కారం లేకపోలేదు.