విజయవాడ (చైతన్యరథం): కనకదుర్గమ్మ అశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలని, అన్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. శక్తిస్వరూపిణి, సర్వలోకాలకు ఆది దేవత బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తితో కలసి ఆదివారం అమ్మకు రామకృష్ణ ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… కష్టకాలంలో అమ్మను శరణు వేడితే, అన్నింటికీ పరిష్కారాలు లభిస్తాయని, లోక కళ్యాణం కోసం అమ్మవారిని పూజించడం మన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయం అన్నారు. గత పాలకుల వైఫల్యాలు రాష్ట్రానికి పెనుశాపంగా మారి, రాష్ట్రం మరింత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న తరుణంలో, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ముదావహమన్నారు. ప్రజలందరి విశ్వాసం, మద్దతుతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్ది, రాష్ట్ర ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను, చిత్తశుద్ధిని చాటుకుంటుందన్నారు.
గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం అమ్మవారిని పూజించడం ద్వారా, ప్రకృతి సమతుల్యత, శాంతి, సర్వమానవుల శ్రేయస్సు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతుందని తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి పూజ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సంపద, శాంతి, సుఖసంతోషాలు లభించాలని ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వంగా ఆవిర్భవించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చుతూ ముందుకు సాగుతోందని, ఈ ఐదేళ్లు రాష్ట్రానికి స్వర్ణ యుగంలాగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు పేరేపి ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరాం ప్రసాద్, వల్లూరు కిరణ్, సాయి జ్యోతి, మహేందర్ రెడ్డి, బీసీ సెల్ అధికార ప్రతినిధి అశోక్ కుమార్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు