- మృతుల్లో ఐదుగురు మహిళలే
- సమాచారంతో హతాశులైన సీపం
- భక్తుల మరణంపట్ల తీవ్ర దిగ్బ్రాంతి
- పెరుగుతున్న మరణాలపై ఆందోళన
- క్షతగాత్రులకు రుయా, స్విమ్స్‌లో చికిత్స
- మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఆదేశాలు
- ఏర్పాట్ల వైఫల్యంపై భక్తుల ఆగ్రహం
- దుర్ఘటనపై అనుమానాల నీలినీడలు
- కుట్రకోణం ఉండి ఉండొచ్చన్న భక్తులు
- ఆ కోణంలోనే మొదలైన పోలీస్ దర్యాప్తు
తిరుపతి (చైతన్య రథం): వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో తిరుపతిలోని ఆసుపత్రులకు తరలించారు. రుయా ఆసుపత్రిలో 20మంది, స్విమ్స్‌లో 9మంది చికిత్స పొందుతున్నారు. రుయా ఆస్పత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్, తితిదే ఈవో శ్యామలరావు చేరుకొని వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారని, సుమారు 40మందికి పైగా గాయాలయ్యాయని, ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడిరచారు. అకస్మాత్తుగా తలెత్తిన తొక్కిసలాట ఘటనలో గాయాలపాలైన 28మందిని రుయా ఆస్పత్రికి, మరో 12మందిని స్విమ్స్‌కు తరలించినట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడిరచారు. రుయాలో చికిత్స పొందుతున్న 28 మందిలో నలుగురు, స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న 12 మందిలో ఇద్దరు మృతి చెందారన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని, ఇప్పటివరకు ఇద్దరిని గుర్తించామన్నారు. మరో నలుగురి చిరునామా తెలియాల్సి ఉంది కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. ప్రమాద సంఘటన వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికివెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని…. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.
తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని తితిదే నిర్ణయించింది. అయితే, టోకెన్ల కోసం ఇవాళ సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్, అదనపు పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. మరోవైపు, ఘటనా స్థలం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు నగర పాలక కమిషనర్ తెలిపారు.
తోక్కిసలాటకు కారణమిదే..
టోకెన్ల కోసం వచ్చిన భక్తులు రోడ్లపై గుమిగూడకుండా బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు. అయితే, టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు క్యూలైన్ తెరిచారు. టోకెన్ల జారీ చేసేందుకు క్యూలైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్యూలైన్ల వద్ద సరైన భద్రత ఏర్పాటు చేయలేదని మరి కొందరు ఆరోపిస్తున్నారు. టోకెన్ల కోసం ఎంతమంది భక్తులు వచ్చారు, ప్రత్యామ్నయ ఏర్పాట్లపై స్థానిక సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది.
ఈనెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం జారీ చేయాల్సి ఉంది. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో ఇవ్వనున్నట్టు తితిదే తెలిపింది. అయితే, భక్తుల రద్దీ కారణంగా ఇవాళ రాత్రినుంచే టోకెన్లు జారీ చేస్తున్నట్టు ఈవో శ్యామలరావు తెలిపారు.
తోపులాట ఘటనపై పలు అనుమానాలు
వైకుంఠ ఏకాదశికి పటిష్టమైన చర్యలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో టీటీడీ భక్తులకు సేవలు అందిస్తుందని ఈరోజు ఉదయం భక్తులనుంచి ప్రశంసలే వచ్చాయి. సాయంత్రానికి ఇలాంటి పరిణామం తలెత్తడంతో దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. అనారోగ్యంతో ఆయాసపడుతున్న వృద్ధురాలిని గుర్తించి గుంపునుండి తప్పించి గేటు లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్న సమయంలో… వృద్ధురాలి వెనుకున్న భక్తులు సైతం సహకరించినట్టు తెలుస్తోంది. సాఫీగా ఉన్న పరిస్థితికి విఘాతం కలిగిస్తూ.. కొద్ది దూరంలో కేకలు అరుపులతో గుర్తు తెలియని వ్యక్తులు దుమారం లేపి.. ఒక్కసారిగా భక్తులను ముందుకు నెట్టడంతో ప్రమాదం చోటుచేసుకుందన్న వాదన వినిపిస్తోంది. ఒక వ్యక్తి కావాలని చేసిన పనా?? లేదా గుంపు చేసిన పనా? అన్న కుట్రకోణంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న టీటీడి అధికారులు, అన్ని వైపుల నుండి భక్తులను వాకబు చేస్తూ సిసి ఫుటేజ్‌ల ఆధారంగా కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనలో మొదటి వరుసలోని భక్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే వెనుక నుండి తోపులాట చేసి తొక్కిసలాటకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం చేసేందుకు ప్రయత్నం చేసిన సిబ్బందికి చిక్కులు తేవడమేకాక, ఆర్గురి మృతికి కారణమయ్యారన్న ఆగ్రహం భక్తులనుంచి వ్యక్తమవుతోంది.
మంత్రుల దిగ్బ్రాంతి
తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు భక్తులు మృతిచెందడం పట్ల మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, రాంప్రసాద్‌రెడ్డి, ఎన్ఎండి ఫరూక్‌లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తాజా పరిస్థతిపై కలెక్టర్ వెంకటేశ్వరన్‌తో మాట్లాడిన మంత్రులు, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. మరిన్ని బలగాలను మొహరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి అనగాని నేడు తిరుపతికి వెళ్లనున్నారు.