- అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్
- పద్మావతి వర్సిటీలో రూ.7.5 కోట్లతో అధునాతన ఇండోర్ స్టేడియం
- ప్రారంభించిన రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్
తిరుపతి (చైతన్య రథం): రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం, మహిళా యూనివర్సిటీ, శాప్ సంయుక్తంగా రూ.7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. అమరావతిలో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పద్మావతి యూనివర్సిటీ వేదికగా ఉత్తమ క్రీడాకారిణులను తయారు చేసేందుకు కొత్తగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణులతో మంత్రి లోకేష్ కొద్దిసేపు షటిల్ ఆడి ఉత్సాహపర్చారు. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటుచేసిన ఏరోబిక్స్, టైక్వాండో, యోగా మెడిటేషన్ సెంటర్లనూ లోకేష్ ప్రారంభించారు. యూనివర్సిటీ విద్యార్థినులు, క్రీడాకారిణులు ఇక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వసతులను వినియోగించుకుని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా మాట్లాడుతూ క్రీడాకారిణులకు యూనివర్సిటీలో మంచి శిక్షణ వేదిక లభించడం తమ విద్యార్థినులకు గొప్ప అవకాశమన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. క్రీడాభివృద్ధికి మంత్రి లోకేష్ చూపుతున్న చొరవ, కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్, యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ రజని, ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.