- మరిన్ని కొనుగోలు కేంద్రాలు
- యాప్‌లో నమోదుకాని రైతుల నుంచీ కొనుగోళ్లు
- అవసరమైతే అద్దెకు ప్రైవేట్ గోడౌన్లు
- మార్క్‌ఫెడ్ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
- రైతులకు నష్టం వాటిల్లకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించిన మంత్రి అచ్చెన్న
గుంటూరు (చైతన్యరథం): మార్క్‌ఫెడ్ ద్వారా చేపట్టిన పొగాకు కొనుగోళ్ల వేగాన్ని మరింత పెంచే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. సోమవారం గుంటూరు రూరల్ ప్రాంతంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పొగాకు సాగుచేసే ప్రాంతాలైన ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్‌లు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, పర్చూరు ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎలూరి సాంబశివరావు, వ్యవసాయ, మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులతో పొగాకు కోనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 2024-25 సంవత్సరంలో నల్లబర్లీ పొగాకు 80 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగిందన్నారు. 22 పొగాకు కంపెనీలు 36.00 మిలియన్ కిలోల పంటను కొనుగోలు చేసాయన్నారు. ఈ నెల 21 నుండి సన్న, చిన్నరైతులను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు యాప్‌లో నమోదు కాని పొగాకు రైతులందరికీ లబ్ధి చేకూరేలా మార్క్‌ఫెడ్ అధికారులు, సిబ్బంది కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలని తెలిపారు. ఏ రైతు దగ్గరా కేజీ పొగాకు కూడా మిగలడానికి వీళ్లేదని, జూలై నెలలో కనిష్టంగా 1 కేజీ నుంచి గరిష్ఠంగా 20 క్వింటాల పొగాకు వరకు ఉన్న రైతుల వద్ద అత్యవసరంగా పొగాకును కొనుగోలు చేయాలని అధికారులను సూచించారు.
చిన్న రైతులకు తోడ్పాటును ఇవ్వటంతో పాటు పెద్ద రైతుల వద్ద కూడా త్వరిగతగిన పొగాకు కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైన మేర కొనుగోళ్ల కేంద్రాలను పెంచాలని, గోడౌన్స్ సరిపోకపోతే ప్రైవేట్ గోడౌన్స్‌ను అద్దెకు తీసుకోవాలని అన్నారు. కోనుగోలు కేంద్రాల వద్ద నుండి గోడౌన్స్ కు పొగాకును తరలించేందుకు రవాణా ఖర్చులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని మంత్రి దృష్టికి కలెక్టర్లు తీసుకురాగా వెంటనే స్పందించారు. రవాణా ఖర్చులను మార్క్ ఫెడ్ భరిస్తుందని కలెక్టర్లకు హమీ ఇచ్చారు. కొనుగోలు యాప్‌లో నమోదైన రైతుల వద్దనే కాకుండా నమోదు కాని రైతుల వద్ద కూడా పొగాకును కొనాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నుండి రైతులకు ఈ సమాచారం చేరవేయాలని, ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరగాలన్నారు. రానున్న సీజన్‌లో రైతులు పొగాకుకు ప్రత్యామ్నాయంగా వేరే పంటలను వేయాలని అందుకు వ్యవసాయ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులకు అందుబాటులోకి ఎరువులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1276 ఆర్‌ఎస్‌కే , (రైతు సేవా కేంద్రం) పీఏసీఎస్ లలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువులు వాడకం ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్ని ఆర్‌ఎస్‌కే ల ద్వారా రైతులకు అందచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేప్డట్టాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ బీ. రాజశేఖర్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ డీల్లీరావు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, మార్కెటింగ్ డైరెక్టర్ సునీత, వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.