- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన లక్ష్యం
- ఇతర రాష్ట్రాలను వెనక్కినెట్టి మనం ముందుండాలి
- కాలయాపన తగదు, రోజుల్లోనే తేల్చేయాలి
- కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇతర రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సు రెండోరోజు గురువారం మంత్రి లోకేష్ మాట్లాడుతూ పోటీ పడుతూ పనిచేస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయన్నారు. పెట్టబడులను ఆకర్షించడానికి దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయన్నారు. ఈ పోటీలో ఇతర రాష్ట్రాలను వెనక్కి నెట్టి మనం ముందుండేలా అధికారులు మరింత చురుకుగా పనిచేయాలన్నారు. భారీ పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రతిపాదనలు వస్తే వాటిని సచివాలయం స్థాయి నుంచి మేం పర్యవేక్షిస్తుంటాం. కానీ జిల్లాల్లో ఎంఎస్‌ఎంఈ రంగంలో చిన్న, చిన్న పెట్టుబడులు పెట్టడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. వారికి అనుమతులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం జరగరాదు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎంఎస్‌ఎంఈ రంగంలో 80 శాతం ఉద్యోగాలు కల్పించవచ్చు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలకు వచ్చే పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలి. నెలలు, సంవత్సరాలు అంటూ కాలయాపన జరగకూడదు. రోజుల్లోనే పనులు జరిగిపోవాలి. మనం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా. ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు.