- ఒకరి అవయవ దానం..మరొకరికి ప్రాణదానం
- బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెతో తిరుపతిలో మరొకరికి ప్రాణదానం
- గుండె తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
- సకాలంలో స్పందించిన మంత్రి లోకేష్‌కి కృతజ్ఞతలు తెలియజేసిన రమేష్ హాస్పిటల్స్, అవయవ దాత, స్వీకర్త కుటుంబాలు
అమరావతి (చైతన్యరథం): ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. మంత్రి లోకేష్ సకాలంలో స్పందించటంతో.. ఒకరి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం చేయనుంది. సొంత ఖర్చులతో గుండె తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా, గ్రీన్ ఛానల్‌కు మార్గం సుగమం చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు రమేష్ హాస్పిటల్స్‌లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవచ్ఛవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణం సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవ దానానికి అంగీకరించారు. వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు.. ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలంటూ మంత్రి నారా లోకేష్‌కు ఒక మెసేజ్ పంపారు. క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి గుండెను చేర్చేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గుంటూరు, గన్నవరం మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. రేణిగుంట నుండి తిరుపతి ఆస్పత్రికి గుండె చేరేవరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మంత్రి లోకేష్ మాట్లాడారు. అసాధ్యం అనుకున్న పని… మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో సుసాధ్యం కావడంతో గుండె మార్పిడి విజయవంతం చేసేందుకు వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మృతురాలి భర్త చెరుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నీ భార్య చెరుకూరి సుష్మ ఆకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక కాలు, చెయ్యి పనిచేయకుండా పోయాయి. వెంటనే రమేష్ హాస్పిటల్స్ కు తీసుకురావడంతో వైద్యులు చికిత్స అందించారు. రమేష్ హాస్పటల్ వైద్యులు అత్యుత్తమ వైద్యం అందించినప్పటికీ నా భార్య కోమాలోకి వెళ్లారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు మాకు తెలిపారు, అవయవ దానం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందని సూచించారు. మా పిల్లలతో చర్చించి అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నాం. హాస్పటల్ యాజమాన్యం, మంత్రి నారా లోకేష్ సహకారంతో తిరుపతిలో ఉన్న వారికి గుండె అందించడం సంతోషంగా ఉంది. అవయవ దానం వల్ల మా ఆవిడ కలకాలం జీవించే ఉంటుందన్నారు.
సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై మంత్రి లోకేష్ వేగంగా స్పందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సాయం చేస్తున్నారు. లోకేష్ సేవాగుణంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.