- అధికారిక లెక్కలు, క్షేత్రస్థాయి నిల్వల్లో తేడా లేకుండా చూడాలి
- యూరియా నిల్వలు, సరఫరాలపై కలెక్టర్లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్
- కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశం
అమరావతి (చైతన్యరథం): యూరియా పంపిణీపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. యూరియా నిల్వలు, పంపిణీ, సరఫరాలపై కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, బాపట్ల, విజయనగరం, కడప, ఏలూరు, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లతో మంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో యూరియా సరఫరా సమస్యలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సమస్యలను అధిగమించాలని సూచించారు. అధికారిక లెక్కలు – గ్రౌండ్ లెవెల్ నిల్వల్లో ఎలాంటి తేడా లేకుండా పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. జిల్లాల్లో ఉన్న యూరియా నిల్వల వివరాలను తక్షణం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నందున కలెక్టర్లు తక్షణం స్పందించి పరిష్కరించాలన్నారు. నిల్వలు ఎక్కువున్న ప్రాంతాల నుండి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు యూరియా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రబీ సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
గంగవరం, కాకినాడ పోర్టుల నుండి రాష్ట్రానికి రావాల్సిన 53 వేల మెట్రిక్ టన్నుల యూరియా సమయానికి చేరుకునేలా రాష్ట్ర అధికారులు, పోర్ట్ అధికారులు, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా, వార్తా పత్రికల్లో వచ్చే తప్పుడు కథనాలపై వెంటనే స్పందించాలని, ప్రతిరోజూ వాస్తవాలు, యూరియా నిల్వల పరిస్థితిపై మీడియాకు వివరణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. యూరియా సరఫరాపై డయల్ యూవర్ కలెక్టర్ అనే కార్యక్రమానికి ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. పలు చోట్ల మన గ్రోమోర్ దగ్గర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో ప్రత్యేక షాపులు ఏర్పాటు చేసి రైతులకు యూరియా అందేలా కలెక్టర్లు చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా యూరియా నిల్వలపై ప్రత్యేక దృష్టి పెడితే ఒక అంచనాకు వస్తామని, రైతులకు సులువుగా పంపిణీ చేసేందుకు అడ్డంకులు తొలుగుతాయన్నారు.
మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, రాబోయే 10 రోజుల వరకు యూరియా పంపిణీ సజావుగా జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. అవరమైతే టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో యూరియా పంపిణీ కి సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ తయారుచేసి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తోందని మంత్రికి ఈఓ స్పెషల్ సీఎస్ రాజశేఖర్ తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢల్లీి రావు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, బాపట్ల, విజయనగరం, కడప, ఏలూరు, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు బాలాజీ, లక్ష్మీ షా, స్వప్నిల్ దినకర్ పుడ్నకర్, మురళి, అంబేద్కర్, శ్రీధర్, వెట్రిసెల్వి, చేతన్ పాల్గొన్నారు.










