హైదరాబాద్: ఏపీలోని పల్నాడు ప్రాంతంలో రైల్వే సమస్యల పరిష్కరించాలని దక్షిణ మధ్య (సౌత్ సెంట్రల్) రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌ను నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో జీఎం అరుణ్ కుమార్‌జైన్‌ను గురవారం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలిసి పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. పల్నాడు ప్రజలకు మేలు కలిగేలా.. ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు ఉన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పిడుగురాళ్ల స్టేషన్లో స్టాపేజ్ ఇవ్వాలని కోరారు. అలాగే విజయవాడ నుండి బెంగళూరు వరకు.. నరసరావుపేట, వినుకొండలో స్టాప్‌లతో కొత్త వందేభారత్ రైలుని ప్రారంభించాలని కోరారు. పెదకూరపాడు స్టేషన్‌లో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు, సత్తెనపల్లి స్టేషన్‌లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు స్టాపేజీ ఇవ్వాలని, విశాఖపట్నం నుండి గుంటూరు వరకు నడుస్తున్న సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేసారు. పేరేచెర్ల నుండి గన్నవరం లేదా పెదవుటపల్లికి కొత్త ఎమ్‌ఎమ్‌టిఎస్ రైలును ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవంతంగా 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకుందని, ప్రస్తుతం ఉన్న బోగీలను వందే భారత్ రైళ్ల ప్రమాణాలతో కొత్త బోగీలకు మార్చాలని కోరారు. కొత్త జిల్లా పల్నాడులో ఆర్‌ఓబీలు, ఆర్యూబీల నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని, కొత్తవి మంజూరు చేయాలని కోరారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల, నడికుడి రైల్వే స్టేషన్లను ప్రతిష్టాత్మకమైన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న రైల్వే లైన్ పనులని త్వరితగతిన పూర్తి చెయాలని కోరారు.