- టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీ దారులు
- వినతులు స్వీకరించిన మాజీ మంత్రి కేఎస్ జవహర్
అమరావతి (చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి తరలి వచ్చిన అర్జీదారుల నుండి మాజీ మంత్రి కేఎస్ జవహర్ వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన రాఘవేంద్రాయుడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి మరణాంతరం తనకు, తన తమ్ముడికి సమానంగా రావాల్సిన వాటాను తన తమ్ముడే ఆక్రమించుకొని తనను ఇబ్బంది పెడుతున్నాడని.. దయచేసి తనకు న్యాయం చేయాలని కోరారు.
అనంతపురం జిల్లా దేవుని ఉప్పలపాడు గ్రామానికి చెందిన నారమ్మ అర్జీ ఇస్తూ.. తాము గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు ఆన్ లైన్ చేయమంటే చేయకుండా హోల్డ్‌లో పెట్టారని దయచేసి తాము సాగు చేసుకుంటున్న భూమిని తమ పేరుమీద ఆన్‌లైన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం మల్లవరం గ్రామానికి చెందిన పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తూ.. గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం భూమిలో కొనసాగుతున్న 20 మంది లబ్ధిదారులకు 1935 లో రైతువారీ భూములుగా కన్వెర్షన్ చేసి రిజిస్టర్‌లో మార్పు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల కొనసాగించేలా చూడాలని కోరారు. సదరు భూమిని దేవాదాయ శాఖ నిషేదిత జాబితా నుండి తొలగించి, నిరభ్యంతర ధృవీకరణ పత్రం అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లా గొర్లదిన్నె మండాలనికి చెందిన లోకేశ్వర్ నాయడు విజ్ఞప్తి చేస్తూ.. తాను ఏపీఎంఎస్‌ఐడీసీలో పనులు చేసి మూడు సంవత్సరాలు దాటినా తాను చేసిన పనికి డబ్బులు రావకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. దయ చేసి తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన దువ్వాసి వసంత కుమారి విజ్ఞప్తి చేస్తూ.. ఎస్సీ మాల కులానికి చెందిన తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. తన కుటుంబ పోషణ నిమిత్తం కేజీబీవీలో నైట్ వాచ్‌మెన్ ఉద్యోగం ఇచ్చి తనకు సాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.
అనంతపురం జిల్లా అనంతపురం మండలం మన్నీల గ్రామానికి చెందిన ముండ్లపాటి కుమారస్వామి విజ్ఞప్తి చేస్తూ.. తమకు వారసత్వంగా వచ్చిన భూమిలోకి దారిలేదంటూ పై పొలాల వారు బెదిరిస్తున్నారని.. దయచేసి పూర్వం నుండి ఉన్న రహదారిని యధావిధిగా కొనసాగేలా అధికారులు సర్వే చేసి తమకు రహదారి సమస్య లేకుండా చూడాలని కోరారు.
గుంటూరు 10వ లైనుకు చెందిన పెరికల లక్ష్మి విజ్ఞప్తి చేస్తూ.. తమ ఇంట్లో 4 సవర్ల బంగారం, రెండు లక్షల రూపాయల డబ్బులు పోయాయని.. తన భర్త వైద్యం కోసం దాచుకున్న డబ్బులను దొంగలు కొట్టేశారని.. దీనిపై త్వరగా విచారించి దొంగలను పట్టుకుని డబ్బులు తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు.