- పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే బాధ్యత గురువులదే
- జాతీయ విద్యా దినోత్సవంలో సీఎం చంద్రబాబు
- పండుగ వాతావరణంలో జాతీయ విద్యా దినోత్సవం
- 166మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం
- టీచర్లను సత్కరించిన సీఎం చంద్రబాబు, విద్యా మంత్రి లోకేష్
విజయవాడ (చైతన్య రథం): సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉపాధ్యాయులకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని వ్యాఖ్యానించారు. మౌలానా ముందుచూపుతోనే నేటి యువత ఐఐటీల్లో రాణిస్తున్నారని అంటూ.. 1953లో యూజీసీ తీసుకొచ్చి విద్యా వ్యవస్థలోనే పెను మార్పులకు కారకులయ్యారని కొనియాడారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగిన విషయాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
ముందుగా ఉపాధ్యాయ వృత్తినుంచి రాష్ట్రపతిగా ఎదిగిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, భారత తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటాలకు కార్యక్రమంలో నివాళి అర్పించారు. ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతోంది. అయితే విజయవాడ వరదలు నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నవంబర్ 11కు వాయిదా వేశారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి అయిన నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ విధంగా ఇద్దరు మహానుభావుల విద్యాసేవలను స్మరించుకుంటూ ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే పురస్కారాల ప్రధానోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగింది.
166మంది ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
రాష్ట్రస్థాయి కమిటీద్వారా ఎంపికైన 166 మంది ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. వారిని శాలువాతో సత్కరించి మెరిట్ సర్టిఫికెట్, మెడల్, జ్ఞాపిక, 20వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి మొత్తం 68మంది ఉపాధ్యాయులను 2024 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపిక చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇద్దరు నేషనల్ అవార్డు గ్రహీతలు, ఇంటర్మీడియట్ విద్య నుంచి 25మంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి 16 మంది, హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి యూనివర్సిటీ ప్రొఫెసర్లు 32మంది, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 19 మంది, ఇంజనీరింగ్, ఫార్మసీ నుంచి నలుగురిని ఎంపిక చేయడం జరిగింది. వీరందరినీ ఘనంగా సత్కరించారు.