- బాధిత కుటుంగాలకు అండగా ఉంటామని భరోసా
అమరావతి (చైతన్యరథం): ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. మహానంది దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదంలో దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై అధికారులనుండి వివరాలు తెలుసుకున్నాను. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ, మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుతాసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిరచారు. మృతులంతా స్టువర్ట్‌పురం వాసులను పోలీసులు తెలిపారు. కారులోని వారంతా మహానంది వెళ్లి.. బాపట్ల తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడిరచారు.
మంత్రుల దిగ్భ్రాంతి
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరావజనేయస్వామి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రోడ్డు భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు రవాణామంత్రి మండిపల్లి ఆదేశాలు జారీచేశారు.