- యువగళం పాదయాత్ర హామీని నెరవేర్చిన మంత్రి
- కోవిడ్ మహమ్మారితో తండ్రిని, ఆస్తిని కోల్పోయిన అక్కాచెల్లెళ్లు
- యువగళంలో కలిసి చదువుకు సాయం కోసం విజ్ఞప్తి
- వారి చదువులకు సాయం చేస్తూ ఆదుకున్న మంత్రి
అమరావతి (చైతన్యరథం): ప్రజా నాయకుడు అంటే కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉండి.. వారి కన్నీరు తుడవడమే అని నిరూపిస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కోవిడ్ మహమ్మారితో తండ్రిని, ఉన్న ఆస్తిని కోల్పోయిన అక్కచెల్లెళ్లకు అన్నగా అండగా ఉంటానని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారు. గతంలో నంద్యాల యువగళం సభలో పురందేశ్వరి అనే బీటెక్ విద్యార్థిని కన్నీటిపర్యంతం అవుతూ యువనేతకు తమ కష్టాలు చెప్పుకున్నారు. కరోనాతో తండ్రి చనిపోగా.. ఉన్న ఆస్తిని వైద్యానికి ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను, తన సోదరి స్నేహలత మధ్యలోనే చదువును ఆపేయాల్సి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. వారి కష్టాలను విని చలించిపోయిన యువనేత… అన్నగా అండగా ఉంటానని, ఇద్దరినీ చదివించే బాధ్యత అన్నగా తాను తీసుకుంటానని సభలో హామీ ఇచ్చారు. దీంతో ఆమె సోదరి స్నేహలతకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్య అందిస్తున్నారు. పురందేశ్వరి ఇంజనీరింగ్ విద్యకు అయ్యే ఫీజును భరిస్తున్నారు. ఈ మేరకు డిసెంబర్ 6వ తేదీన కాలేజీ ఫీజు రూ.1,45,000 చెల్లించారు. మానవత్వంతో స్పందించి తమకు అన్నలా అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్‌కు పురందేశ్వరి, స్నేహలత కృతజ్ఞతలు తెలిపారు.