- ప్రజా సమస్యలపై తక్షణం స్పందించాలి
- హంగూ, ఆర్భాటాలు అవసరం లేదు
- రాష్ట్ర పునర్నిర్మాణమే మన తక్షణ కర్తవ్యం
- పాలనలో మార్పు స్పష్టంగా గోచరించాలి
- అభివృద్ధికి నిధులకంటే.. సంకల్పం ముఖ్యం
- సంపద సృష్టితో సమానంగా.. సంక్షేమం
- మన పాలసీలే.. ప్రగతిరథ చక్రాలు
- టీంలీడర్‌గా మీకు అందుబాటులో ఉంటా
- ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షించుకుందాం
- కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగింపులో సీఎం చంద్రబాబు
అమరావతి, (చైతన్య రథం): ఏపీ పునర్నిర్మాణమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని, అందులో జిల్లాల కలెక్టర్లు ముఖ్యభూమిక పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సచివాలయం వేదికగా రెండురోజులపాటు సాగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో గురువారం రాత్రి చంద్రబాబు ముగింపు ఉపన్యాసమిచ్చారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సు సుదీర్ఘంగా 13 గంటలపాటు సాగింది. రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా కీలక విభాగాలను లోతుగా సమీక్షించిన చంద్రబాబు.. కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేశారు. ‘సింపుల్ గవర్నమెంట్.. స్పీడ్ గవర్నెన్స్’ ప్రభుత్వ ఉద్దేశంగా గుర్తుచేస్తూ.. పాలనలో స్పష్టమైన మార్పు కనిపించేలా కలెక్టర్లు చిత్తశుద్ధితో పని చేయాలని చంద్రబాబు సూచించారు. ‘ఆరు నెలల్లో విధ్వంసం నుంచి వికాసంవైపు ప్రయాణం చేస్తున్నా’మని అంటూనే.. రాష్ట్ర పునర్నిర్మాణంలో యంత్రాంగం పాత్ర కీలకమని ఉద్భోదించారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్’ పెరగాలని అంటూనే.. ‘మొదటి నుంచీ హంగూ ఆర్బాటాలు లేవు. రెడ్, గ్రీన్ కార్పెట్లు లేవు. ఎంత సింపుల్‌గావుంటే ప్రజలు అంత అభిమానిస్తారు, అభినందిస్తారు. అధికారులుగా ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించండి’ అని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారమే ముఖ్యమని, సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలన్నారు.
ప్రజలు సమస్యలతో మీ దగ్గరకు వస్తున్నారంటే.. ఎక్కడో మన పరిపాలనలో లోపాలు ఉన్నట్టు గ్రహించాలి. ఆర్థికేతర సమస్యల్ని సాధ్యమైనంత వరకూ సంపూర్ణంగా పరిష్కరించండి. ఒకవేళ పరిష్కారం కాకపోతే.. ఎందుకు పరిష్కరించలేక పోయామో కారణాలను స్పష్టంగా రికార్డుల్లో పెట్టండి. నిజమైన అర్హులకు ఆర్థిక సమస్యలూ పరిష్కరించాలి. అన్ని కార్యక్రమాలకూ నిధలు అవసరం లేదు.. సంకల్పం ముఖ్యం’ అని చంద్రబాబు ఉద్బోధించారు. ప్రభుత్వంలో ఇంకా గుక్క తిప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని అధిగమించగలిగే ఆత్మస్థైర్యం కూడా ఉందన్నారు. సూపర్ సిక్స్‌లో కొన్ని ఇప్పటికే అమలు చేశామని అంటూ.. ఇంకా కొన్ని అమలు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. విధి నిర్వహణలో వినూత్నంగా ఆలోచన చెయ్యాలంటూనే.. ఇన్నోవేషన్ కనిపించాలని సూచించారు.
‘అన్న క్యాంటీన్, పెన్షన్లు, దీపం, డీఎస్సీలు అమలు చేశాం. పనులు చేయడం ఒక ఎత్తు అయితే దానిని ప్రజల్లోకి తీసుకుపోవడం మరో ఎత్తు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుందో ప్రజలకు చెపాల్సింది మీరే’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
‘మీ దగ్గరకు ఎవరు వచ్చినా కలిసేలా రిసెప్షన్ సెంటర్ పెట్టండి. మనం ప్రజా సేవకులమేగాని, పెత్తందారులం కాదు. ప్రతి నెలా మొదటి తారీఖున ప్రజల సేవ కార్యక్రమం పెట్టాం. మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 25 పాలసీలు ఇప్పటికే ఇచ్చాం. అవసరమైతే మరో 5 పాలసీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. వాట్సప్ గవర్నెన్స్ పటిష్టంగా అమలు చేద్దాం. సాంకేతికతను ఉపయోగించుకొని మెరుగైన ఆలోచనలు చేయాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు మొదటి ప్రాధాన్యమివ్వాలి. తప్పు చేసిన వాళ్లు మళ్లీ తప్పు చేయాలంటే భయపడేలా చేసి రెవిన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి’ అని చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. లా అండ్ ఆర్డర్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలంటూనే.. మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవ్వరినీ వదిలి పెట్టవద్దని గట్టిగా చెప్పారు. మద్యం, శాండ్ పాలసీలో చాలా స్పష్టత ఇచ్చామని, గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య రంగంలో రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నామని, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఎట్టిపరిస్థితుల్లో చెక్ పెట్టాలి. స్మగ్లర్లు ఎంత పెద్దవాళ్లయినా వదలొద్దు. ప్రక్షాళన ముఖ్యం అని చంద్రబాబు సూచించారు.
అగ్రికల్చర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అంటూ.. రైతులకు ఏ ఒక్క సమస్యా రాకుండా చూడాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్నింటినీ పూర్తి చేస్తామని, వంశధార, పోలవరానికి కనెక్టవిటీ ఇస్తే గేమ్‌ఛేంజర్ అవుతుందన్నారు. గోదావరి నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకువెళతామని, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తెచ్చేలా చూడాలని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. జీరో పావర్టీ, పీ4 పాలసీలన్నింటిలోనూ అమలు చేయాలంటూ.. నాణ్యమైన విద్యను అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామంటూ.. జల్ జీవన్ మిషన్, అర్భన్ ఏరియాలో అమృత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందిస్తామన్నారు. నరేగా ద్వారా ఏ జిల్లాలో ఎంత లేబర్ కాంపోనెంట్ చేయగలిగితే అంత మెటిరియల్ కాంపోనెంట్ వస్తుందని, ఒకప్పుడు రూ.2వేల నుంచి రూ.10వేల కోట్లకు తీసుకువెళ్లానని గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వ భవనాలన్నింటిపై సోలార్ రావాలని, రూఫ్ టాప్ సూర్యఘర్, కుసుమ్ ఘర్ ఉపయోగించుకోవాలన్నారు. ఇప్పుడుగాని ఉపయోగించుకోకపోతే తరువాత ఆంక్షలు పెడతారని, అప్పుడు చేయగలిగేదీ ఏమీ ఉండదని హెచ్చరించారు. పాలసీలన్నింటినీ ప్రజలతో అనుసంధానించి.. 10 సూత్రాలను అమలు చేయడంలో ప్రతి ఒక్క కలెక్టర్ ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటేనే వాళ్లు మనతో ఉంటారని, 1995లో సీఎంగా ప్రతి ఒక్క రోజూ క్రియేటివిటీ ఉండేదని, ప్రతి ఒక్క సమస్యనూ పరిష్కారంగా మార్చుకున్నామన్నారు. నేను తెచ్చిన కార్యక్రమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేలు చేసిన తప్పుడు పనులు కలెక్టర్లు చేస్తే దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలని సూచించారు. ‘నేను మీకు టీం లీడర్‌ను. అందరికీ అందుబాటులో ఉంటాను. ప్రతి 6 నెలలకు అన్ని శాఖలతో రివ్యూ చేసుకొని రాష్ట్రాన్ని ముందుంచేలా చూస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.