న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో శుక్రవారం షాక్ తగిలింది. రాజధాని అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ల నిర్మాణం వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి చేసినప్పటికీ తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి నివాస గృహాలు నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని సింఘ్వి వాదించారు. రాజధానికి సంబంధించిన ప్రధాన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు పెండిరగ్లో ఉందని రైతుల తరపు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందిస్తూ.. ఏం జరుగుతుందో తమకు అన్నీ తెలుసని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. సింఘ్వి విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. కేసుపై ఏప్రిల్‌లో విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
భారతి సిమెంట్స్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టులో భారతీ సిమెంట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్( ఎఫ్డీ)లపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్‌డీల మొత్తాన్ని విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. భారతీ సిమెంట్స్ ఎఫ్‌డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు తీసుకొని ఎఫ్డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును ఈడీ.. సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ వాదనలతో ఏకీభవించింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని తెలంగాణ హైకోర్టుకు.. సుప్రీంకోర్టు సూచించింది.
అయితే, బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నాక కూడా ఎఫ్డీలను జప్తు చేశారని భారతీ సిమెంట్స్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. కనీసం ఎఫ్‌డీల పైన వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ భారతీ సిమెంట్స్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఎఫ్డీలు విడుదల చేయాలన్న హైకోర్టు తీర్పునే పునఃపరిశీలించాలని సూచించినప్పుడు.. జప్తు చేసిన దానికి వడ్డీ ఎలా వస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ ముగించినట్లు వెల్లడిరచింది. అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది