- బీసీ మహిళని అడ్డంపెట్టుకుని రాజకీయాలా?
- ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్మన్ సుజాత
మంగళగిరి (చైతన్య రథం): బీసీ మహిళను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకోవడం వైసీపీ నేత పేర్ని నాని దిగజారుడుతనానికి నిదర్శనమని ఏపీ మహిళా సహకార ఆర్థికసంస్థ ఛైర్మన్ పీతల సుజాత దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్‌రెడ్డి డైరెక్షన్‌లో సాగుతోన్న వైసీపీ నేతల నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. లోకేష్‌ను టార్గెట్ చేయమని, ఎమ్మెల్యేని టార్గెట్ చేయమని పేర్ని నాని ఫోన్‌లో డైరెక్షన్లు ఇవ్వడం.. వైసీపీ నీచ రాజకీయలకు నిలువెత్తు నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రజలు హర్షిస్తున్న కూటమి పాలనపై అక్కసుతో విధ్వంస రాజకీయాలకు తెగబడుతున్న వైసీపీ.. తప్పులమీద తప్పులు చేస్తూ తన ఉనికిని తానే చెరిపేసుకుంటుందని సుజాత వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల వైసీపీ విధ్వంసపాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేసినా.. నిస్సిగ్గుగా ప్రవర్తించడం వైసీపీ భ్రష్ట రాజకీయానికి పరాకాష్టగా సుజాత అభివర్ణించారు. ‘‘అధికారం కోల్పోయేసరికి వైసీపీలకు మతి భ్రమించింది. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఏపీ అభివృద్ధి వైసీపీకి ఇష్టంలేదు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జగన్‌కు, వైసీపీ నేతలకు నచ్చటం లేదు. రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తుంటే.. సంక్షేమ పాలనకు ప్రజల సంతోషాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.
అందుకే `రాష్ట్రంలో విద్వేషాలు, విధ్వంసాలకు పురిగొల్పి.. ప్రశాంత వాతావరణాన్ని పాడుచేయాలని చూస్తున్నారు’ అని పీతల సుజాత దుయ్యబట్టారు. ఒకపక్క వైసీపీ అధినేత జగన్ రప్పా రప్పా ఆడిరచాలంటాడు. మరోపక్క పేర్ని నాని ‘కన్ను గీటితే రాత్రుళ్లే వేసేసి.. తర్వాత ఏమీ తెలియనట్టు అందరిలాగా వెళ్లి పరామర్శించాలి’ అనటం.. వైసీపీ రాజకీయాలు ప్రజలు హర్షించేవేనా? అని ప్రశ్నించారు. వైసీపీ హయంలో ఆగస్టు 15న పట్టపగలే రమ్య అనే యువతని నరికేసిన ఘటనను గుర్తు చేస్తూ.. కూటమి ప్రభుత్వంలోనూ అలాంటి రక్తదాహాలు సాగుతాయనుకోవడం పొరబాటని హెచ్చరించారు. ‘తప్పు చేసినవాళ్ల తాట తీస్తుంది కూటమి ప్రభుత్వం. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పేర్ని నాని గ్రహించాలని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని చట్టం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీ మాటలు, చేష్టలు, పార్టీ అనుసరిస్తోన్న విధ్వంస విధానాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది’ అని పీతల సుజాత హెచ్చరించారు.