- అపార అవకాశాలు వినియోగించుకోండి
- మంత్రి నారా లోకేష్ ఆహ్వానం
ఆనంద్ మహీంద్రా తెలుగు ట్వీట్‌కు స్పందించిన మంత్రి
అమరావతి (చైతన్యరథం): మహీంద్రా కంపెనీ తెలుగుతో విడుదల చేసిన ప్రకటనపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ ప్రకటనపై సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తెలుగులో చేసిన ట్వీట్‌పై మంత్రి లోకేష్ కూడా ట్వీట్ ద్వారా స్పందించారు. ఆనంద్ మహీంద్రాను ప్రశంసిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో మహీంద్రా వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మహీంద్రా వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకి ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.
తెలుగు యాడ్ నచ్చింది సార్. మీ వాహనాలకు ఏపీ పెద్ద మార్కెట్. మీ ప్రకటన కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని నేను నమ్మకంతో ఉన్నా. ఇదే సమయంలో మా రాష్ట్రానికి మీకు ఆహ్వానం పలుకుతున్నా. మా రాష్ట్రంలోని అధునాతన ఆటోమోటివ్ ఎకో సిస్టం, పెద్ద మార్కెట్‌ను సద్వినియోగం చేసుకునేలా ఆలోచించండి. సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్రా తయారీ యూనిట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించండి. మీ ప్రతినిధి బృందాన్ని పంపిస్తే రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న అవకాశాలను వివరిస్తానని మంత్రి లోకేష్ ఆహ్వానం పలికారు.