- తురకపాలెంలో పర్యటించిన రాష్ట్ర ఉన్నత వైద్యుల బృందం
- రక్త నమూనాల నివేదిక కోసం చూస్తున్నాం: రఘునందన్
గుంటూరు (చైతన్య రథం): గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలవిల్లాడుతోంది. దాదాపు మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో గత ఐదు నెలల్లో 28 మరణాలు సంభవించాయి. జులై, ఆగస్టు నెలల్లోనే 20మంది వరకు మరణించారు. గత నాలుగైదు రోజుల్లో బాలశౌరి (50), నీలాంబరం (50), ఆరోగ్యమ్మ (60) వివిధ రోగ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గ్రామానికి వెళ్లి పరిస్థితిపై సమీక్షించాలని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడు డీఎంఈ డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో రాష్ట్ర వైద్య బృందం తురకపాలేనికి వెళ్లింది. మరణాలకు దారితీసిన కారణాలను రక్త నమూనాల రిపోర్టులు అందాకే చెప్పగలమని రాష్ట్ర ఉన్నత వైద్యుల బృందం పేర్కొంది. ఈ గ్రామంలో గడచిన 5 నెలల్లో 30మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ నెలలో ఇప్పటి వరకు రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ మరణాలు మెలైడియోసిస్ కారణంగా జరిగాయా? లేదా? అన్న విషయం శనివారంలోగా అందే రక్త నమూనాల పరీక్షల నివేదిక ఫలితాల ద్వారా తెలుస్తుందని ఉన్నత వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ మీడియాకు వెల్లడిరచారు. ప్రస్తుతం గుంటూరు జిజిహెచ్‌లో ఇద్దరు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారని వెల్లడిరచారు. ఇప్పటి వరకు జ్వరంతో ఉన్న 29మందినుంచి సేకరించిన రక్తనమూనాలను గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారని చెప్పారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెలైడియోసిస్ వ్యాధిపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐవి యాంటీబయోటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటున్నారని చెప్పారు.
వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డిఎంఈ డాక్టర్ రఘునందన్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, స్థానిక వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణ్ ఇతర అధికారులు తురకపాలెం గ్రామాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మరణించినవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తురకపాలెంలో డాక్టర్ రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది జనవరినుంచి మార్చి మధ్య ఐదుగురు మరణించారు. ఏప్రిల్‌లో 2, మేలో 3, జూన్‌లో 2, జులైలో 10, ఆగస్టులో 10 చొప్పున మరణాలు నమోదయ్యాయి. బీపీ, షుగర్, కిడ్నీల పనితీరు మందగించడంవంటి ఇతర వ్యాధులు కలిగిన మరణించిన వారిలో 80 శాతం పురుషులున్నారు. ఓ ప్రయివేట్ ఆసుపత్రి రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా ఇద్దరు మెలైడియోసిస్ బారిన పడినట్టు గుర్తించారని మా దృష్టికొచ్చింది. గత నెలలో వేర్వేరు తేదీల్లో ఈ రెండు కేసులు వచ్చాయి. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ల్యాబ్‌లో జరిగే పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. తురకపాలెం గ్రామంలో గతనెల 29నుంచి వైద్య శిబిరం కొనసాగుతోంది. గ్రామ జనాభా 2500 కాగా, వీరిలో ఇప్పటి వరకు 1200 మందికి పరీక్షలు చేశాం. బుధవారం 42మంది పరీక్షలు చేయించుకోగా వీరిలో ఎక్కువ మందిలో జ్వరపీడితులున్నారు. వీరు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి దగ్గు, కీళ్ల నొప్పులున్నాయి. స్థానికుల్లో 30 ఏళ్లు దాటిన వారిలో బీపీతో 30శాతం, షుగర్‌తో 10 శాతం బాధపడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది’’ వెల్లడిరచారు. తురకపాలెం గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని డీఎంఈ డాక్టర్ రఘునందన్ చెప్పారు. స్థానికులు పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.
గ్రామస్థులందరికీ పరీక్షలు: మంత్రి ఆదేశం
తురకపాలెంలోని అందరికీ కిడ్నీ పరీక్షలు, షుగర్‌తో పాటు అవసరమైన ఇతర పరీక్షలు చేయాలని వైద్యారోగ్య అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వైద్య శిబిరాల్ని కొనసాగించాలని, వ్యక్తిగత శుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. మరోవైపు తురకపాలెం గ్రామంలో ఉన్నప్పుడే డీఎంఈ డాక్టర్ రఘునందన్‌కు ఫోన్ చేసి క్షేత్రస్థాయి సమాచారాన్ని తెలుసుకున్నారు.