- ఒకే రోజు 105 అభివృద్ధి పనులకు శ్రీకారం
- దేశ, రాష్ట్ర చరిత్రలోనే ఇదో అరుదైన ఘట్టం
- సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధికే అత్యంత ప్రాధాన్యత
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి (చైతన్యరథం): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించటంపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. బహుశా దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు స్పూర్తిగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.
రికార్డు దిశగా అడుగులు ఇలా..
కాగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొత్త ఒరవడిని సృష్టించారు. ఆదివారం ఒక్క రోజే 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆశీస్సులతోనే ఈ స్థాయిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గం అత్యధికం సిటీలోనే ఉంటుంది. తన నియోజకవర్గంలో ఉన్న మౌలిక సమస్యలను గుర్తించి.. కొద్దిపాటి ఖర్చుతో అయిపోయే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు కోటంరెడ్డి ఏర్పాట్లు చేసుకుని, ఇలా రెండు, మూడు వందల పనులను గుర్తించారు. నెల్లూరు నగరానికి చెందిన మంత్రి నారాయణతో కలిసి ప్రయత్నించి నిధులు తెచ్చుకున్నారు. ప్రజాభాగస్వామ్యంతోనే పనులు ప్రారంభిస్తున్నారు. తన చుట్టూ తిరిగే వారికి ఏమీ ఉండదని.. ప్రజల్లో క్షేత్ర స్థాయిలో పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. దాన్ని కోటంరెడ్డి వంద శాతం ఆచరిస్తున్నారు.
వైసీపీలో ఉండగా చేయలేకపోయిన పనులన్నీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇప్పుడు వరుసపెట్టి పూర్తి చేయిస్తున్నారు. శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టబోవడం లేదని, ఇప్పుడు మొదలుపెట్టిన పనులన్నీ 60 రోజులలో పూర్తిచేస్తానని ప్రజలకు వాగ్ధానం చేశారు. తనకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుకనే శంకుస్థాపనలు చేసి 60 రోజులలో అన్ని పనులు పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు. అయితే తానేమీ ఇదేదో ఘనకార్యంగా భావించడం లేదని, ప్రజలు తనపై నమ్మకంతో మళ్ళీ గెలిపించారు కనుక వారి ప్రతినిధిగా నియోజకవర్గంలో వారి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి.. తన నియోజకవర్గంలో చిన్నచిన్న పనులకు కూడా నిధులు మంజూరు చేయడం లేదంటూ, ఓ డ్రైనేజీపై వంతెన కోసం నడుం మేర మురుగు నీటిలో నిలబడి నిరసన తెలిపి సంచలనం సృష్టించారు. అధికారంలో ఉన్నది తన పార్టీనా, ప్రత్యర్థి పార్టీనా.. అన్న తేడా లేకుండా తన నియోజకవర్గంలో అభివృద్ధిపైనే గురిపెట్టి కోటంరెడ్డి సాగుతూ ఉంటారు. ఆదివారం నాటి రికార్డు ప్రారంభోత్సవాల్లోనూ ఆయన తనదైన శైలిని పాటించారు. ఆయా పనులను ఆయన కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలతోనే ప్రారంభింపజేశారు. ఈ చర్యతో అటు అభివృద్ధికే కాకుండా ఇటు పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకూ కోటంరెడ్డి సమప్రాధాన్యం ఇచ్చారు.
ఈ తరహాలో ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా ఇన్నేసి పనులను ఒకే రోజు శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. అందుకే కోటంరెడ్డిని అభినందిస్తూ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
కూటమిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ తమ నియోజకవర్గాలలో గుంతలు పడిన రోడ్లకు మరమత్తులు చేయించుకున్నారు. అవసరమైన చోట కొత్త రోడ్లు వేయించుకున్నారు. తమ తమ నియోజకవర్గాలలో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక పనులను చకచకా చేయించుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో ప్రజలకు అవసరమైన చిన్నచిన్న పనులు కూడా చేయించుకోలేక అధికార వైసీపీ ఎమ్మెల్యేల చేతులెత్తేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు జోరుగా పనులు చేయించుకుంటున్నారు. దీన్ని బట్టే జగన్ పాలనకు, ప్రగతి కాముకుడు చంద్రబాబు నాయుడు పాలనకు తేడా అర్థం చేసుకోవచ్చు.