అమరావతి (చైతన్య రథం): పాఠశాలల్లో ఎటువంటి డ్రాపవుట్స్ లేకుండా చూడాలని, బడి ఈడు పిల్లలంతా పాఠశాల నెట్ వర్కులోకి వచ్చేలా సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అవసరమైతే బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. లిటిగేషన్లకు తావులేకుండా ఉద్యోగుల సర్వీసు నిబంధనలను పటిష్టంగా అమలు పర్చాలని, యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సంబంధిత నోటిఫికేషన్‌ను సాధ్యమైనంత త్వరగా జారీచేయాలన్నారు. ఉన్నత విద్యలో తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలు ముందజలో ఉన్నాయని, అదేస్థాయిలో ఏపీని నిలిపేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. అందుకు ఆఫ్ లైన్ కోర్సులతోపాటు ఆన్ లైన్ కోర్సులను పెద్దఎత్తున ప్రవేశపెట్టాలని సూచించారు. జెఈఈ మెయిన్స్ ఫలితాల్లో టాప్ హండ్రెడ్‌లో నిలిచిన ఏపీ విద్యార్థి మనోజ్ఞ గుత్తికొండను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు.