విశాఖపట్నం (చైతన్యరథం): ఏపీలో సెకండరీ/శాటిలైట్ ఎండీఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని యాక్షన్ టెసా ఎండీ, సీఈఓ వివేక్ జైన్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. యాక్షన్ టెసా భారతదేశంలోని ప్రముఖ ఇంజనీర్డ్ కలప ప్యానెల్ తయారీదారు. 1970లలో స్థాపితమైన ఈ సంస్థ పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, రసాయనాలు, ఫ్లెక్స్ తయారీ, బొగ్గు మైనింగ్, ఇంజనీర్డ్ కలప ఉత్పత్తులలో విభిన్న కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2025లో రూ.4,865 కోట్ల వార్షిక రెవిన్యూ సాధించిన యాక్షన్ టెసా దేశంలో ఏ క్లాస్ నగరాలు, 70శాతం బీ క్లాస్ నగరాల్లో పాన్ ఇండియా ఉనికి కలిగి ఉంది. సీఈఓ వివేక్ జైన్ తో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో భేటీ అయిన సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం సితార్ గంజ్ తయారీ కేంద్రం 7.5లక్షల సీబీఎం సామర్థ్యంతో పనిచేస్తున్నందున, ఏపీలో సెకండరీ యూనిట్ ఏర్పాటుచేస్తే అదనపు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు డిమాండ్ మద్దతునిస్తుందని చెప్పారు. దీనిపై సీఈఓ వివేక్ జైన్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థలో ప్రస్తుతం 2,846మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. 2018లో మేం ఏడోతరం కాంటిరోల్ టెక్నాలజీని విజయవంతంగా ప్రారంభించాం. ఉత్పత్తి వైవిధ్యం కోసం డోమ్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వివేక్ జైన్ తెలిపారు.













