- ఆధ్యాత్మికత, భక్తిభావం చాటేలా ఏర్పాట్లు
- ఎలాంటి లోటుపాట్లు లేకుండా వసతులు
- అధికారులకు మంత్రుల బృందం ఆదేశం
పుట్టపర్తి(చైతన్యరథం): పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సభ్యులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం స్థానిక సాయి ఆరామంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ఉత్సవాలకు సంబంధించిన సన్నాహాలు, భద్రతా ఏర్పాట్లు, వసతి, రవాణా, వైద్య సేవలు, ప్రజా సౌకర్యాలపై విస్తృతంగా చర్చించా రు. మంత్రుల బృందం చైర్మన్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా ఏర్పాట్లను పూర్తి చేయడమే అంతిమ లక్ష్యం కావాలన్నారు. ఆధ్యాత్మికత, భక్తిభావం, శాంతి, ప్రేమ చాటేలా ఉత్సవాలను నిర్వ హించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని.. ఆ మేరకు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్దంగా ఏర్పా ట్లను పూర్తి చేసేలా అధికారులు సమన్వయంగా కృషి చేయా లని సూచించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొంటున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుట్టపర్తి పట్టణంలో శుభ్రత, ట్రాఫిక్ నిర్వహణ, నీటి, విద్యుత్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ట్యాంక్‌బండ్‌పై జంగిల్ క్లియరెన్స్ చేయాలి
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే లోటుపాట్లను సరి దిద్దుకుని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఉత్సవాలు ప్రారంభమై నప్పటి నుంచి ఏ రోజు ఎంతమంది భక్తులు వస్తారు, వారికి ఏర్పాటు చేసిన వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలలో పటిష్టమైన చర్యలు తీసుకోవాల న్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను అమలు చేయాలని, చిత్రావతి ట్యాంక్‌బండ్‌పై జంగిల్ క్లియరెన్స్ చేసి అభివృద్ధి చేయా లని సూచించారు.
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ భగవాన్ సత్య సాయిబాబా 100వ జయంత్యుత్సవాలు అంతర్జాతీయ స్థాయిలో జరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేసి ప్రధానమంత్రి పర్యటనకు తగిన విధంగా ప్రతి అంశం పకడ్బందీగా అమలవ్వాలని సూచించారు. ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఆయన జిల్లా వైద్యాధికారులు, సూపరింటెండెంట్లు, వైద్య సిబ్బందితో మాట్లాడి వేడుకలకు విచ్చేసే భక్తులు, ప్రముఖులు, వృద్ధులు, మహిళలు, పిల్లలకు తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలన్నా రు. పుట్టపర్తి ప్రాంతంలోని ప్రధాన రహదారులు, వసతి కేంద్రా లు, పలు ముఖ్యమైన పరిసర ప్రాంతాల్లో 24 గంటల అంబులెన్స్ సేవలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమీప ఆసుపత్రులు, ముఖ్యంగా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది నిరంతర విధుల్లో ఉండాలని, భద్రతా కారణాల దృష్ట్యా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ప్రతి విభాగంలో ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది నిరంతర పహరాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా వైద్య అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణ స్పందన ఇవ్వగల మొబైల్ మెడికల్ యూనిట్లు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
సమావేశంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ సత్య సాయిబాబా జయంతి వేడుకలకు పకడ్బందీ చర్యలు చేపట్టి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. పండుగ వాతావరణంలో జయంతి వేడుకలు అధికారికంగా జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఈ వేడుకల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. ముఖ్యంగా నవంబరు 17 నుంచి 23 వరకు వివిధ ప్రముఖులు వస్తున్న నేప థ్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక వైభవానికి తగిన రీతిలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణా ళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఆయా కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు. పుట్టపర్తికి నలుదిక్కుల రోడ్లు మరమ్మతులు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వస్తున్నారని, అలాగే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలన్నారు.
పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడు తూ పుట్టపర్తి సత్య సాయిబాబా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సత్యసాయి బాబా మహాసమాధి దర్శన నిమిత్తం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యా లు కల్పించాలని, వాహనాలకు పార్కింగ్‌తో పాటు పట్టణంలో రాక పోకల ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ భక్తులు పుట్టపర్తి రావడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 200 బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సంబంధిత అధికారులను సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ శత జయంతి ఉత్సవాలకు కట్టుదిట్టం గా పటిష్ట మైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, డీఐజీ షిమో షి, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆర్డీవోలు సువర్ణ, వివిఎస్ శర్మ, మహేష్ పాల్గొన్నారు.














