- శ్రీఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం పీఠాధిపతికి మంత్రి లోకేష్ వినతి
- అంగీకరించిన జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామి
- కర్ణాటకలోని శ్రీఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి
- పీఠాధిపతి నిర్మలానందనాథ మహాస్వామి ఆశీస్సులు పొందిన లోకేష్
- మఠం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తెలుసుకున్న వైనం
- సంవిత్ పాఠశాలల్లో 6 నుంచి ఇంటర్ వరకు అన్ని వసతులతో పేద విద్యార్థులకు ఉచిత విద్య
- తరువాత ఏ రాష్ట్రంలో డిగ్రీ చదివినా మఠం ఆర్థిక సాయం
కర్ణాటక (చైతన్యరథం): కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ సామాజిక-ఆధ్యాత్మిక కేంద్రం శ్రీఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం సందర్శించారు. శ్రీ ఆదిచుంచునగిరి మహాసంస్థానం ఒక ఆధ్యాత్మిక దివ్యధామం. శతాబ్దాల చరిత్ర, అసంఖ్యాకమైన భక్తుల నమ్మకం, అణువణువునా నిండిన భక్తిభావం, అపారమైన మానవసేవ.. ఇవన్నీ కలిసి ఆ క్షేత్రాన్ని ఒక శక్తి కేంద్రంగా మార్చేశాయి. 18 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మఠం జ్ఞానానికి, భక్తికి, సేవకు పర్యాయపదంగా నిలిచింది. తొలుత క్షేత్రంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామివారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం చేపడుతున్న వివిధ సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మఠం 72వ పిఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ ఆశీర్వాదం పొందారు.
మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, యూనివర్సిటీను మంత్రి నారా లోకేష్
సందర్శించారు.
అనంతరం మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిత్ పాఠశాలల గురించి ప్రత్యేకంగా అడిగితెలుసుకున్నారు. ఈ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా 6వ తరగతి నుండి ఇంటర్ వరకూ అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నాం అని మఠం నిర్వాహకులు తెలిపారు. అంతే కాకుండా ఇంటర్ పూర్తయిన తరువాత ఏ రాష్ట్రంలో డిగ్రీ చదవాలి అనుకున్నా మఠం ఆర్థిక సహాయం అందిస్తుంది అని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులకు ఉపయోగపడేలా సంవిత్ పాఠశాల ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ కోరగా పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ అందుకు అంగీకరించారు. దీంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపే ఒక గొప్ప సంకల్పం ఆవిష్కృతమైంది.