- కడప తిరంగా యాత్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
- జాతీయ పతాకాల రెపరెపలతో యాత్రకు విశేష స్పందన
కడప (చైతన్యరథం): దేశ భద్రతలో ఎనలేని ధైర్యసాహసాలు, శౌర్యపరాక్రమాలు ప్రదర్శిస్తున్న మన త్రివిధ దళాలకు శిరస్తు వంచి నమస్కరిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని, భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తి రగిలిస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తిరంగా యాత్రలు నిర్వహిస్తోంది. కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఏర్పాటు చేసిన తిరంగా యాత్రలో శనివారం పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో పార్టీ జెండా చేతపట్టుకుని, కార్యకర్తల మధ్య నడుచుకుంటూ ఆయన ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారు.
వందలాది మంది పార్టీ కార్యకర్తలు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు (పీపీపీలు), నియోజకవర్గ నాయకులు, అభిమానులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ‘జై భారత్’, ‘జై తెలుగుదేశం’, ‘వందే మాతరం’ నినాదాలతో నగరం మార్మోగింది. వరుసగా రెండో రోజు పల్లా శ్రీనివాసరావు తిరంగా యాత్రల్లో పాల్గొన్నారు. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిర్వహించిన యాత్రలో పాల్గొన్న వెంటనే ఆయన కడప చేరుకొని ఈ యాత్రలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన రాక కార్యకర్తల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం అర్పిస్తున్న మన సైనికుల పట్ల కృతజ్ఞత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ తిరంగా యాత్రలు చేపడుతున్నామన్నారు. ఇది ఒక రాజకీయేతర ప్రజా ఉద్యమం. ప్రజల్లో దేశభక్తిని చిగురింపజేసే మహాకార్యమన్నారు.