- శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు
- సీఎం వెంటుండి స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్
- తితిదే డైరీలు, క్యాలెండర్లకు ఆవిష్కరించిన చంద్రబాబు
- ఉప రాష్ట్రపతితో కలిసి స్వామి వాహన సేవలో సీఎం
తిరుపతి (చైతన్య రథం): అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఇవాళ సాయంత్రం మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులు.. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేశ్ ఉన్నారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదపండితులు సీఎం
చంద్రబాబునాయుడు కుటుంబానికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సీఎం కుటుంబానికి స్వాగతం పలికారు. తరువాత
ముఖ్యమంత్రి ఆలయ ధ్వజస్తంభానికి నమస్కరించి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ముఖ్యమంత్రి కుటుంబానికి ఆశీర్వచం అందించారు.
టీటీడీ చైర్మన్, ఈవో ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా 2026 ఏడాది తితిదే డైరీలు, క్యాలెండర్లను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారి పెద్దశేష వాహనసేవలో పాల్గొన్నారు. రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించిన పెద్దశేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలూ ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, తితిదే బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులలో జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ధర్మకర్తల మండలి హయాంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తితిదే సకల ఏర్పాట్లు చేసింది.
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా గాయత్రి అతిథి గృహంవద్ద చంద్రబాబు, లోకేశ్కు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఈరోజు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న చంద్రబాబు.. 25న ఉదయం 9.10కి వెంకటాద్రి నిలయానికి చేరుకుని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితరాలను ప్రారంభిస్తారు. 9.50 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అనంతరం 10.40కి తిరుగు ప్రయాణమవుతారు.
వెంకన్నకు భక్తుని భారీ కానుక
విశాఖకు చెందిన హిందుస్థాన్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్రావు, కుంకుమ దంపతులు తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక అందించారు. రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి బహూకరించారు. ఈ సందర్భంగా తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు.. దాతలను అభినందించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.